జేబీఎస్‌- ఎంజీబీఎస్‌ మార్గంలో పరుగులు పెట్టిన మెట్రో.. ప్రారంభించిన కేసీఆర్

By సుభాష్  Published on  7 Feb 2020 11:37 AM GMT
జేబీఎస్‌- ఎంజీబీఎస్‌ మార్గంలో పరుగులు పెట్టిన మెట్రో.. ప్రారంభించిన కేసీఆర్

హైదరాబాద్‌ మెట్రో అంచెలంచెలుగా పరుగులు పెడుతోంది. జేబీఎస్‌ – ఎంజీబీఎస్‌ మార్గంలో 11 కిలోమీటర్ల మేర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. దీంతో గ్రేటర్‌ నగరంలో మొత్తం 69 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చినట్లయింది. బీజేఎస్‌- ఎంజీబీఎస్‌ మెట్రో ప్రారంభం సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్‌, సికింద్రాబాద్‌, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తన్‌బజార్‌, ఎంజీబీఎస్‌ మెట్రో స్టేషన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్గంలో జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ కు చేరుకోవడానికి 16 నిమిషాల సమయం పడుతుంది. ఈ మార్గంలో నిత్యం లక్ష మంది వరకు ప్రయాణికులు ప్రయాణిస్తారని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు.

మెట్రో ప్రారంభం అనంతరం కేసీఆర్‌ ఎంజీబీఎస్‌ వరకు ప్రయాణించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌, మంత్రులు కేటీఆర్‌, మహ్మద్‌ఆలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డి, ప్రభుత్వ, మెట్రో అధికారులు పాల్గొన్నారు. ఇక మొదటి దశ మెట్రో ప్రాజెక్టులో ప్రతిపాదించిన 72 కిలోమీటర్ల మార్గంలో 69 కిలోమీటర్ల వరకు సేవలు విస్తరించాయి. దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో కారిడార్‌గా స్థానం దక్కించుకుంది. రాబోయే వంద సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మెట్రో నిర్మాణం జరిగింది.

Next Story