గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ.. ఎన్నికల వాయిదాపై చర్చ?

By Newsmeter.Network
Published on : 15 March 2020 1:37 PM IST

గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ.. ఎన్నికల వాయిదాపై చర్చ?

ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి గవర్నర్‌ హరిచందన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఉదయమే ఏపీలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ రమేష్‌ కుమార్‌ ప్రకటించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉందని, ఏపీలో కరోనా వైరస్‌ ప్రభావం ఉండటంతో ఉద్యోగులు, పార్టీలతో చర్చించిన అనంతరం ఎన్నికలను వాయిదా వేసేందుకు నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు.

ఈ ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే సీఎం జగన్మోహన్‌రెడ్డి గవర్నర్‌తో భేటీ కావటం రాజకీయాల్లోఆసక్తికర చర్చకు దారితీసింది. ఎన్నికల సంఘం నిర్ణయంపై సీఎం జగన్మోహన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా ఈసీ నిర్ణయం తీసుకోవడాన్ని జగన్‌ తప్పుబడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌తో భేటీ అయిన జగన్మోహన్‌రెడ్డి .. ఈ విషయాలపై గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. అంతేకాక పలువురు అధికారులను మార్పుచేస్తూ, ఓ సీఐను సస్పెండ్‌ చేస్తూ ఈసీ నిర్ణయం జగన్‌కు మింగుడుపడని విషయంగా మారినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని గవర్నర్‌తో చర్చించేందుకు జగన్‌ వెళ్లారని ఏపీలో ప్రచారం సాగుతుంది.

మరోవైపు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై గవర్నర్‌తో చర్చించడానికి జగన్‌ వెళ్లారని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. పూర్తిస్థాయిలో బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై చర్చించే అవకాశం ఉందని, కరోనా వైరస్‌ వైరస్‌ నివారణపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు జగన్మోహన్‌రెడ్డి వివరించేందుకు వెళ్లారని ఆపార్టీ నేతలు పలువురు పేర్కొంటున్నారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన కొద్దిసేపటికే జగన్‌ వెళ్లి గవర్నర్‌తో భేటీ కావటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

Next Story