బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన‌ ‘పౌరసత్వ సవరణ బిల్లు’కి రాజ్యసభ ఆమోదం తెలిపింది. స‌భ‌లో మెజార్టీ సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటెయ్య‌డంతో ‘పౌరసత్వ సవరణ బిల్లు-2019’ ఆమోదం పొందినట్లు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు.

ఇదివ‌ర‌కే.. ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ ఉద‌యం అమిత్ షా రాజ్య‌స‌భ‌లో పౌరసత్వ సవరణ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఆయా పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. హోంమంత్రి అమిత్‌షా స‌భ్యుల‌ సందేహాలకు వివరణ ఇచ్చారు. ఆ తర్వాత రాజ్యసభ ఛైర్మన్ వెంక‌య్య నాయుడు బిల్లుపై ఓటింగ్‌ నిర్వహించారు.

బిల్లుపై ఓటింగ్ సమయానికి పెద్ద‌ల‌ సభలో మొత్తం 209 మంది సభ్యులు ఉన్నారు. బిల్లుకు అనుకూలంగా 117 మంది స‌భ్యులు ఓటెయ్య‌గా.. వ్యతిరేకంగా 92 మంది స‌భ్యులు ఓటు వేశారు.

ఓటింగ్‌కు ముందు పౌరసత్వ సవరణ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలా..? వద్దా..? అనే అంశంపై ఓటింగ్‌ నిర్వహించారు. ఆ సమయంలో 223 మంది సభ్యులు స‌భ‌లో ఉండగా.. వ‌ద్ద‌ని 124 మంది, పంపాలని 99మంది సభ్యులు ఓటు వేశారు. ఒకరు ఓటింగ్‌లో పాల్గొనలేదు. దీంతో రాజ్యసభ ఛైర్మన్ వెంక‌య్య‌నాయుడు బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపేందుకు నిరాకరిస్తున‌ట్లు ప్రకటించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.