రివ్యూ : 'చూసీ చూడంగానే' నచ్చేస్తుందా..!?
By రాణి Published on 31 Jan 2020 11:42 AM ISTశివ కందుకూరి హీరోగా పరిచయమవుతున్న 'చూసీ చూడంగానే' చిత్రాన్ని రాజ్ కందుకూరి ధర్మ పథ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. శేష సింధు రావ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో వర్ష బొల్లమ్మ, మాళవికా సతీశన్ హీరోయిన్లుగా నటించగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ గోపి సుందర్ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ సినిమా పై ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
సిద్ధూ (శివ) పేరెంట్స్ కారణంగా చిన్నప్పటి నుండి చదువుతో సహా ఇష్టం లేని పనులు చేస్తూ తానూ కోరుకున్న విధంగా జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతాడు. అలా తనకు ఇష్టం లేకుండానే బి.టెక్ లో జాయిన్ అవుతాడు. అయితే కాలేజీలో ఐశ్వర్య (మాళవికా సతీశన్)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా సిద్ధూని ప్రేమిస్తోంది. అలా నాలుగేళ్లు ప్రేమలో మునిగి తేలిన సిద్ధూ - ఐశ్వర్య ఫైనల్ ఇయర్ లో విడిపోతారు. ఇక సిద్ధూ చివరికి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ గా లైఫ్ ని లీడ్ చేస్తోన్న క్రమంలో అతని జీవితంలోకి శ్రుతి రావ్ (వర్ష బొల్లమ్మ) వస్తోంది. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ ఒకరికొకరు చెప్పుకోరు. అంతలో సిద్ధూకి శ్రుతి గురించి ఒక నిజం తెలుస్తోంది. ఆమె కాలేజీ నుండే సిద్ధూని ప్రేమిస్తోందని తెలుసుకుంటాడు. మరి ప్రేమిస్తోనప్పటికీ శ్రుతి ఆ విషయం సిద్ధూకి ఎందుకు చెప్పదు ? వారిద్దరి ప్రేమ కథలో వచ్చిన సమస్య ఏమిటి ? చివరకి సిద్ధూ - శ్రుతి ఒక్కటి అయ్యారా ? లేదా ? అనేది మిగతా కథ.
నటీనటులు :
శివ కందుకూరి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో మెస్మరైజ్ చేయకపోయినా కాస్త కొత్తగానే ప్రయత్నం చేశాడు. తన లుక్స్ అండ్ యాక్టింగ్ పరంగా కూడా ఈ సినిమాలో కొత్తగా కనిపించడానికి బాగానే తాపత్రయ పడ్డాడు. జనరల్ కుర్రాడి పాత్రలతో, తన ఈజ్ యాక్టింగ్ తో శివ బాగానే ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన వర్ష బొల్లమ్మ తన నటనతో పాటు గ్లామర్ తోనూ బాగా ఆకట్టుకుంది. ప్రేమ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తన పెర్ఫార్మెన్స్ తో వర్ష మెప్పించింది. హీరోకి మదర్ గా నటించిన పవిత్ర లోకేష్ కూడా తన ఎమోషనల్ నటనతో ఆకట్టుకుంది. అలాగే మరో కీలక పాత్రలో నటించిన మాళవికా సతీశన్, మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. సినిమాలో గోపి సుందర్ అందించిన సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయింది.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకురాలు రాసుకున్న స్క్రిప్ట్ తో ఏ మాత్రం విషయం లేదు. సినిమా పేరులో ఉన్న క్యాచీనెస్ సినిమాలో లేకుండా పోయింది. యూత్ కనెక్ట్ అయ్యే అంశాలు పెడుతున్నామనుకొని ఓవర్ లవ్ సీన్స్ తో ప్లే ల్యాగ్ చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ కు పూర్తి అపోజిట్ లో ఉండే హీరో క్యారెక్టర్.. ఈ కాన్ ఫ్లిట్ చాలు.. సన్నివేశాలను ఆసక్తికరంగా రాసుకొని సినిమా మీద ప్రేక్షకుడికి మంచి ఇంట్రస్ట్ పుట్టించడానికి....కానీ దర్శకురాలు ఈ పాయింట్ ను బలంగా ఎలివేట్ చేసే సీన్స్ ను రాసుకోకుండా విషయం లేని, అలాగే ఇంట్రస్ట్ గా సాగని సీన్స్ తో సినిమాని చాల బోర్ గా మలిచింది. దీనికి తోడు బలం లేని కథలో బలహీన పాత్రలను రాసుకున్నారు. హీరోకి గోల్ ఉన్నా.. దాని కోసం ఆలోచనకే పరిమితం అవ్వటం తప్ప.. చేసేది ఏమి లేదు. అసలు అతనికి ఒక క్లారిటీ కూడా ఉండదు. దాంతో హీరో పాత్ర ప్రేక్షకులకి అంతగా కనెక్ట్ కాకపోగా చికాకు కలిగిస్తుంది. పైగా ఈ చిత్రంలో తెర మీద పాత్రల్ని నిలబెట్టి అసలు సంఘటనంటూ సన్నివేశమంటూ ఏది లేకుండా.. ప్రతి సన్నివేశం రొటీన్ వ్యవహారాలతోనే చాలా ఊహాజనితంగా సాగుతుంటుంది.
ఇక సంగీత దర్శకుడు గోపి సుందర్ అందించిన పాటలు కూడా పర్వాలేదు. ముఖ్యంగా ఓ సాంగ్ ఆకట్టుకుంటుంది. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో పర్వాలేదనిపిస్తోంది. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాలో చాల వరకు బోర్ తగ్గేది. సినిమాలో సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కొన్ని విజువల్స్ ను చాలా సహజంగా అలాగే చాలా అందంగా చూపించారు. ఇక నిర్మాత రాజ్ కందుకూరి పాటించిన నిర్మాణ విలువలు పర్వాలేదు.
ప్లస్ పాయింట్స్ :
సినిమా థీమ్ అండ్ హీరో జర్నీ
హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ
ఎమోషనల్ గా లవ్ సీక్వెన్సెస్
గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.
మైనస్ పాయింట్స్ :
స్లోగా సాగే లవ్ స్టొరీ
పేలవమైన కథనం
బోరింగ్ ట్రీట్మెంట్ అండ్ సిల్లీ కామెడీ
ఇంట్రస్ట్ గా లెక్వ్ ట్రాక్స్
ఆకట్టుకొని డైరెక్షన్
చివరగా..
లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా కొన్ని లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ లో మెప్పించినా సినిమా మాత్రం జస్ట్ ఒకే అనిపిస్తోంది. ప్రేమ కథలని డీల్ చేసేప్పుడు కథతో పాటు పాత్రలు, సన్నివేశాలు కూడా ప్రేక్షకుల్ని సినిమాలో లీనం చేసేలా ఉండాలి. కానీ ఈ ప్రేమ కథ వ్యవహారం అలా లేదు. అయితే హీరో హీరోయిన్ల నటన, వాళ్ళ ఎమోషన్ ఓకే అనిపించినా బలహీనమైన కథాకథనాలు, ఇంట్రస్ట్ గా సాగని సన్నివేశాలు, కనెక్ట్ కాని ప్లేతో సినిమా ఒకే దగ్గరే ఆగిపోయింది. మొత్తం మీద.. చూసీ చూడంగానే.. ఒకసారి చూడొచ్చు.