యూనివర్సల్ బాస్‌ ఉంగరాన్ని చూశారా.. ? ప్రత్యేకత ఏంటంటే..?

By Newsmeter.Network  Published on  22 Feb 2020 12:11 PM GMT
యూనివర్సల్ బాస్‌ ఉంగరాన్ని చూశారా.. ? ప్రత్యేకత ఏంటంటే..?

ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు క్రిస్‌గేల్‌. అభిమానులు ముద్దుగా యూనివర్సల్‌ బాస్‌ అని పిలుచుకుంటారు. బంతిని అలవోకగా స్టేడియం బయటికి పంపగలడు. విండీస్‌ తరుపున ఎక్కువగా ఆడకపోయినా.. విదేశీ లీగుల్లో అలరిస్తూ ఉంటాడు ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌. ఇక మనోడికి బంగారం అంటే మోజు ఎక్కువ. క్రిస్‌గేల్‌ ఫోటోలు చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది.

తాజాగా ఈ కరేబియన్‌ వీరుడు ఓ ప్రత్యేక బంగారు ఉంగరాన్ని అభిమానులకి సోషల్ మీడియా ద్వారా చూపించాడు. నాణ్యమైన బంగారంతో చేసిన ఈ ఉంగరం మధ్యలో CG (Chris Gayle) అని పేరు, చుట్టూ నాలుగు వైపులా Universe Boss అని రాసుంది. ఇక ఉంగరం అడుగు భాగంలో క్రిస్‌గేల్ ఆటోగ్రాఫ్ కూడా ఉండగా.. పక్కల్లో 333 అనే నెంబర్ ఉంది. టెస్టుల్లో క్రిస్‌గేల్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 333 అన్న సంగతి తెలిసిందే.. అందుకే అతను ధరించే జెర్సీపైనా ఈ నెంబర్‌నే వేయించుకున్నాడు.

Chris Gayle Rings

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున సుదీర్ఘకాలం ఆడిన ఈ ఆటగాడు తరువాత కింగ్స్ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుకి మారాడు. ప్రతి సీజన్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లతో అభిమానులను అలరిస్తున్న గేల్.. తాజా ఐపీఎల్ 2020 సీజన్‌లో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. మార్చి 29 నుంచి ఐపీఎల్-13వ సీజన్‌ ప్రారంభం కానుండగా.. మార్చి 30న ఢిల్లీ క్యాపిటల్స్‌తో పంజాబ్ తన తొలి మ్యాచులో తలపడనుంది. ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటి వరకూ 125 మ్యాచ్‌లాడిన గేల్.. 4,484 పరుగులు చేశాడు. ఇందులో ఆరు శతకాలు ఉండగా.. అత్యధిక వ్యక్తిగత స్కోరు 175 పరుగులు.

Next Story
Share it