ఎన్ని ఫ్లాపులొచ్చినా క్రేజ్ తగ్గట్లేదే.!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Jun 2020 1:22 PM GMTఒకప్పుడు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించాడు విక్రమ్. తమిళంలో సామి, పితామగన్, అన్నియన్.. లాంటి వరుస బ్లాక్ బస్టర్లతో అతను సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించాడు. వీటిలో పితామగన్, అన్నియన్ చిత్రాలు శివపుత్రుడు, అపరిచితుడు పేర్లతో తెలుగులో అనువాదమై ఇక్కడా మంచి విజయాలు సాధించాయి. ఇక విక్రమ్‌కు తిరుగులేదని అంతా అనుకున్నారు.
కానీ ఆ తర్వాత పదిహేనేళ్లు గడవగా.. ఇప్పటిదాకా విక్రమ్ నుంచి నిఖార్సయిన హిట్ ఒక్కటీ రాలేదు. శంకర్ దర్శకత్వంలో చేసిన ‘ఐ’ సహా అన్నీ నిరాశ పరిచాయి. ఐతే ఎన్ని డిజాస్టర్లు వచ్చినా.. ఎన్ని ఫ్లాపులిచ్చినా విక్రమ్‌కు ఇంకా క్రేజ్ అయితే తగ్గలేదు. అతను హీరోగా పేరున్న దర్శకులు, పెద్ద నిర్మాతలు భారీ చిత్రాలు ప్లాన్ చేస్తూనే ఉన్నారు.
ప్రస్తుతం విక్రమ్ హీరోగా ‘కోబ్రా’ అనే థ్రిల్లర్‌తో పాటు రూ. 300 కోట్ల బడ్జెట్లో ‘మహావీర కర్ణ’ అనే పీరియడ్ మూవీ కూడా తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు విక్రమ్ హీరోగా మరో క్రేజీ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. ‘పిజ్జా’తో దర్శకుడిగా అరంగేట్రం చేసి.. జిగర్‌తండా, ఇరైవి, పేట లాంటి క్రేజీ సినిమాలు డైరెక్ట్ చేసిన కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో విక్రమ్ నటించబోతున్నాడు.
ప్రస్తుతం కార్తీక్.. ధనుష్ హీరోగా ‘జగమే తంత్రం’ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. లాక్ డౌన్ లేకుంటే ఈపాటికే ఆ చిత్రం రిలీజయ్యేది. మళ్లీ థియేటర్లు తెరుచుకున్న కొన్ని రోజుల్లోనే ఈ సినిమా విడుదల కానుంది. లాక్ డౌన్ టైంలో ఆ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పని కూడా ముగించిన కార్తీక్.. తన కొత్త చిత్రానికి స్క్రిప్టు కూడా పూర్తి చేశాడు. నాలుగేళ్ల కిందటే విక్రమ్‌కు ఓ కథ చెప్పిన కార్తీక్.. ఇప్పుడు దాన్ని పూర్తి స్క్రిప్టుగా మార్చాడు. ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఓకే అయింది. లాక్ డౌన్ అవ్వగానే దీని చిత్రీకరణ మొదలవుతుంది.