చిరుతలకు అడవిలో 'అమ్మఒడి' పథకం
By సుభాష్ Published on 24 Jan 2020 11:21 AM GMTఆకులు కదులుతున్నాయి... కొమ్మలు రెమ్మలు కిర్రు మంటున్నాయి. అక్కడక్కడా ఓ కోతి కొమ్మలపై కొమ్మచ్చి ఆడుతోంది...సూర్యుడు ఆకుల పరదాలను, కొమ్మల తెరలను చీల్చుకుని నేలను తాకేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాడు. అక్కడెక్కడో ఓ పక్షి పాడుతోంది... వీటిని వదిలేస్తే మిగతా అంతా నిశ్శబ్దం.
నేల మీద ఒక ముప్ఫై మంది జాగ్రత్తగా తమ కెమెరాలను అమర్చుకుంటున్నారు. స్టాండ్ మీద కెమెరాలు పెట్టి, యాంగిల్స్ ఫిక్స్ చేసి, ఆ వస్తున్న అడవి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నాయి. బోలెడు కెమెరాలు... ఎందుకంటే అరుదైన అడవి బిడ్డను అన్ని యాంగిల్స్ లో ఫోటో తీసేందుకు అవి సిద్దంగా ఉన్నాయి. అన్నీ అమర్చి ఆ ముప్ఫై మంది తమ తమ జీపుల్లో ఎక్కి నిశ్శబ్దంగా కూర్చున్నారు.
అడవి బిడ్డ కోసం ఎదురుచూపు. అక్కడ ఒక బోను ఉంది.. అందులో ఉంది అడవి బిడ్డ. ఆ అడవి బిడ్డ ఒక చిరుతపులి.. ఈ హడావిడంతా చిరుతకు నచ్చలేదు. విసుగ్గా ఒక సారి అరిచింది. నోరంతా తెరిచింది. కోరలన్నీ చూపించింది. ఈ బోనులేమిటి, తలుపులేమిటన్నట్టు ఉరిమి చూసింది. దాని గర్జనకు కార్లు, జీపుల్లో ఉన్నవారు ఎక్కడికక్కడ బిగుసుకుపోయారు.
నెమ్మదిగా బోను తలుపులను చెట్టు మీద నుంచి తాడు సాయంతో తెరిచారు. ఎక్కడి వారు అక్కడె గప్ చుప్.. చిరుత బద్ధకంగా బోను దిగింది. ఒక్క క్షణం తరువాత బాణమంత వేగంతో పరుగుపెట్టింది. క్షణం తరువాత వెదురుపొదల వెనుక లీలగా కనిపించింది. ఆ తరువాత అనంతమైన అడవిలోకి ఆ అడవి బిడ్డ అదృశ్యం అయిపోయింది. బోలెడన్ని కెమెరాలున్నా ఒకటి చిరుత తోకను, ఒకటి దాని పంజాను, ఒకటి దాని శరీరం మీద మచ్చలను, ఒకటి కళ్లను ఫోటోల్లో బంధించింది.
ఇంతకీ ఆ చిరుత ఎక్కడిదో తెలుసా? అది ఇటీవలే షాద్ నగర్ లో ఒక ఇంటి డాబా మీద దర్శనమిచ్చి, ఊరు ఊరంతటినీ ఉరికించిన చిరుత. దాన్ని హైదరాబాద్ జూ అధికారులు పట్టుకుని, తీసుకువచ్చి ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో వదిలేశారు. ఆ తరువాత కొద్ది సేపటికే రెండో చిరుతను తీసుకొచ్చారు. అది ఈ మధ్యే నల్గొండలో వైర్లలో చిక్కుకుని దొరికింది. అడవిలోకి అడవి బిడ్డ రయ్ రయ్ మంటూ పరుగులు తీసింది.
అటవీ శాఖాధికారులు రెండింటినీ నీళ్లు అందుబాటులో ఉన్న చోట విడివిడిగా విడుదల చేశారు. ఆకలేస్తే తినేందుకు కుందేళ్ల తో సహా బోల్డు జంతువులు దొరికే చోట వదిలేశారు. ఒక చిరుతను విడుదల చేసిన చోటు నుంచి 20 కిమీ దూరంలో రెండో చిరుతను వదిలేశారు. అలా అడవి వదిలి ఊళ్లోకి దారితప్పి వచ్చిన రెండు చిరుతలను మళ్లీ వాటి సొంతిళ్లకు పంపించేశారు అధికారులు. అడవి బిడ్డలు అడవి తల్లి ఒడిలోకి వెళ్లిపోయాయి. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో ఇప్పటికే ఒక వంద చిరుతలున్నాయని అటవీశాఖాధికారులు చెబుతున్నారు. ఇప్పుడు మరో రెండు వచ్చి చేరాయి. మొత్తం మీద అడవిలో చిరుతలకు “అమ్మ ఒడి” పథకం అమలైందన్న మాట!! అటవీ శాఖ టైగర్ రిజర్వు ఫీల్డు డైరెక్టర్ ఎకే సిన్హా, నెహ్రూ జువాలజికల్ పార్కు క్యురేటర్ ఎన్ క్షితిజలు ఈ ఆపరేషన్ కు సారథ్యం వహించారు.