కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన చిరంజీవి.. ఇక షూటింగ్ లు మొదలవుతున్నట్లే..!
By సుభాష్ Published on 22 May 2020 6:35 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు భేటీ అయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమలో షూటింగ్ లు మొదలవ్వాలని, లేకపోతే చాలా మంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని చిరంజీవితో సహా పలువురు సినీ ప్రముఖులు కేసీఆర్ ను కోరారు. దీనిపై కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్ లో కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారికి పరిశ్రమలోని యావన్మంది తరుపున కృతఙ్ఞతలు. ఈ రోజు వారు సినిమా, టీవీ, డిజిటల్ మీడియా కి సంబంధించిన సమస్యలు సానుకూలంగా విని, వేలాదిమంది దినసరి వేతన కార్మికులకు ఊరట కలిగేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.. అని చిరంజీవి ట్వీట్ చేశారు. వినోద పరిశ్రమ పునఃప్రారంభించే విధి విధానాలు త్వరలోనే ప్రభుత్వం రూపొందించి, అందరికి మేలు కలిగేలా చూస్తుందని హామీ ఇచ్చారని చిరంజీవి తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ, టీవీ పరిశ్రమ తరపున తాను కేసీఆర్ కు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.
కేసీఆర్ తో భేటీలో అవుట్‌డోర్, ఇండోర్ షూటింగ్‌లు జరిగే ప్రాంతాల్లో తీసుకునే ముందస్తు జాగ్రత్తలను వివరిస్తూ ఓ మాక్ వీడియోని చూపించారు చిత్ర పరిశ్రమ పెద్దలు. షూటింగ్ పరిసర ప్రాంతాలలో భౌతిక దూరం పాటిస్తూ ఎలాంటి జాగ్రత్తలతో ముందుకు వెళ్తామన్నది కూడా వివరించినట్లు తెలుస్తోంది. జూన్‌లో సినిమా షూటింగ్‌లు ప్రారంభించుకోవాలని చెప్పారు. సినిమా షూటింగ్‌లపై విధి విధానాలు రూపొందించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. లాక్‌డౌన్ కారణంగా నిలిచిన సినిమా షూటింగ్‌లు, రీప్రొడక్షన్లు దశలవారీగా పునరుద్ధరిస్తామని, లాక్‌డౌన్ నిబంధనలు, కొవిడ్ నివారణ మార్గదర్శకాలు పాటించాలని కేసీఆర్ సూచించారు.