సీఎం జగన్ - 'సైరా' చిరంజీవి మధ్యలో గంటా..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Oct 2019 4:05 PM GMT
సీఎం జగన్ - సైరా చిరంజీవి మధ్యలో గంటా..!

అమరావతి: రేపు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని చిరంజీవి ఆయన కుమారుడు రామ్‌ చరణ్ కలుస్తున్నారు. 'సైరా' మూవీకి సంబంధించి అదనపు షోలకు పర్మిషన్‌ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. దీంతో కృతజ్ఞతలు చెప్పడానికి తండ్రికొడుకులు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలుస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు..'సైరా నరసింహరెడ్డి' మూవీ కూడా చూడాలని వైఎస్ జగన్‌ను చిరంజీవి, రామ్ చరణ్ కోరనున్నారని సమాచారం. మొత్తానికి ఇది పైకి..ఒక టాలీవుడ్ భేటీలా కనిపిస్తున్నప్పటికీ..రాజకీయ చర్చలు కూడా జరుగుతాయని అమరావతి టాక్‌.

చిరంజీవికి అత్యంత సన్నిహితుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు. చిరంజీవి కుటుంబంలో కుటుంబంలో ఉంటారు. చిరు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలోకి వెళ్లి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తరువాత చిరంజీవి కేంద్రంలో మంత్రైయితే..గంటా ఉమ్మడి ఏపీలో మంత్రి అయ్యారు. ఆ తరువాత రాష్ట్ర విభజన.. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో గంటా శ్రీనివాస రావు టీడీపీలో చేరారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు మంత్రి వర్గంలో స్థానం సంపాదించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడి పోయినప్పటికీ..గంటా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే..అప్పటి నుంచి గంటా చూపు వైసీపీ వైపు ఉందని చెబుతారు విశాఖలో ఆయన అనుచరులు. అయితే..నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణకు వియ్యంకుడు కావడం..చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు కావడంతో సీఎం వైఎస్ జగన్‌ ...గంటా విషయంలో మాట్లాడకుండా ఉంటున్నారు. గంటా బలమైన కాపు సామాజికవర్గానికి సంబంధించిన నేత అయినప్పటికీ జగన్ దూరంగానే పెట్టారు.

అయితే..రేపు చిరు సీఎం జగన్‌ను కలుస్తున్న సందర్భంగా మెగాస్టార్‌తో కలిసి జగన్‌ను గంటా కలుస్తారా?లేదా?అనేది రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. చిరు ద్వారా గంటా రాయ'బేరం'నడుపుతారని చాలా మంది అంటున్నారు. కాని..సీఎం వైఎస్ జగన్ ఒక నిర్ణయం తీసుకున్నారంటే వెనక్కి తగ్గడు. గంటా విషయంలో వైఎస్ జగన్ ఎలా ఆలోచిస్తున్నారనేది ప్రధాన ప్రశ్న. ఎందుకంటే ..వైఎస్ఆర్‌ సీపీలో బలమైన కాపు నేతలు ఉన్నారు. గంటా వైఎస్ఆర్ సీపీకి ఉందా అని ఆ పార్టీ నేతలే ప్రశ్నించుకఉంటున్నారు. ఏదిఏమైనా..రేపు కనుక చిరుతో గంటా సీఎం జగన్ కలిస్తే..రూట్ క్లియర్‌ అవుతుందో లేదో చూడాలి.

జస్ట్ క్యాజువల్ మీట్ అని చిరు అభిమానులు చెబుతున్నప్పటికీ, టాలీవుడ్ లో టాక్ నడుస్తున్నప్పటికీ..సమావేశం వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని మరో మాట కూడా వినిపిస్తుంది. గంటా ఏదో విధంగా వైఎస్ఆర్ సీపీలో కి రావడానికి ప్రయత్నిస్తున్నారని..చిరంజీవి చేత రూట్ క్లియర్ చేయించుకునే పనిలో ఉన్నారని కొంత మంది కాపు సామాజికవర్గపు నేతలు అంటున్నారు. గంటాకు పార్టీ అంటూ ఏమీ ఉండదని రాజకీయ, వ్యాపార ప్రయోజనాలు చుట్టే గంటా పాలిటిక్స్ నడుస్తుంటాయని ఆయన గురించి బాగా తెలిసివారు చెబుతుంటారు. సో..రేపు జరగబోయే సీఎం జగన్ సైరా చిరు భేటీ గంటా తలరాత మారుస్తుందో లేదో చూడాలి.

Next Story