అంతరిక్షంలో కృత్రిమ చంద్రుడు

By రాణి  Published on  20 Dec 2019 7:01 PM IST
అంతరిక్షంలో కృత్రిమ చంద్రుడు

ముఖ్యాంశాలు

  • వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన చైనా
  • 2020 కల్లా అంతరిక్షంలోకి కృత్రిమ చంద్రుడు
  • 2022 నాటికి మరో మూడు..
  • స్ర్టీట్ లైట్స్ ఖర్చు తగ్గించేందుకు చైనా ఆలోచన

చైనా ఒక వినూత్న ప్రయోగం చేయనుంది. తమ దేశం కోసం చైనా కృత్రిమ చంద్రుణ్ణి తయారు చేయనుందట. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ..! కానీ ఇది నమ్మి తీరాలి. నిజంగానే చైనా 2020 కల్లా ఒక కృత్రిమ చంద్రుడిని తయారు చేసి అంతరిక్షంలోకి పంపించనుంది. మనం ఎప్పుడూ చూస్తుంటే చంద్రుడు భూమికి సుమారుగా 3,84,400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నట్లుగా అనిపిస్తాడు. అంత ఎత్తునుంచి పున్నమి నాడు వచ్చే వెన్నెల తెల్లని పిండి ఆరబోసినట్లుగా ఉంటుంది. అయితే ఈ వెన్నెలను చంద్రుడు తనంతట తానుగా ఇచ్చేది కాదుట. సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు చంద్రుడి మీద పడి అక్కడి నుంచి అవి భూమిపైకి పరావర్తనం చెందడంతో మనకు వెన్నెల వస్తుందని శాస్ర్తవేత్తలు చెప్తున్నారు.

China Space Mirror 2

చైనా తయారు చేస్తున్న కృత్రిమ చంద్రుడు మన సహజ చంద్రుడిలా గోళాకారంలో కాకుండా వృత్తాకార పళ్లెం ఆకారంలో ఉంటుందట. అయితే ఈ కృత్రిమ చంద్రుడిని తయారు చేసేందుకు ఏం వినియోగిస్తున్నారో శాస్ర్త వేత్తలు ఇంత వరకూ బయటికి చెప్పలేదు కానీ తాజాగా అందిన సమాచారం మేరకు గాజు, పైబర్ వంటి పదార్థాలను కృత్రిమ చంద్రుని తయారీకి ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కృత్రిమ చంద్రుడిని చైనాలో ఉన్న సిచుయాన్ లాంచ్ సెంటర్ నుంచి క్సిచంగ్ శాటిలైట్ ద్వారా భూ ఉపరితలం నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలోకి ప్రవేశ పెట్టబోతున్నారని సమాచారం. అయితే ఈ కృత్రిమ చంద్రుడు కేవలం చైనాలో మాత్రమే కనిపిస్తాడట.

అసలు ఈ కృత్రిమ చంద్రుడిని తయారు చేయాలన్న ఆలోచన అక్కడి శాస్ర్తవేత్తలకు ఎందుకొచ్చిందో తెలుసా ? అక్కడ నగరాలలో ఉన్న స్ర్టీట్ లైట్స్ కి అయ్యే ఖర్చును తగ్గించడానికట. ఈ కృత్రిమ చంద్రుడు రాత్రి సమయంలో అంతరిక్షంలో ఉంటూ సూర్యుడి కిరణాలను చైనాలోని కొన్ని నగరాల వైపుకి పరావర్తనం చెందిస్తాడు. ఈ కాంతి దాదాపు 60-80 కిలోమీటర్ల వరకూ విస్తరిస్తుంది. ఈ చంద్రుడి నుంచి వచ్చే కాంతి సహజ చంద్రబింబం నుంచి వచ్చే వెన్నెల కంటే 8 రేట్లు ప్రకాశవంతంగా ఉంటుందని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. ఒకవేళ చైనా చేస్తున్న ఈ ప్రయోగం సక్సెస్ అయితే నిపుణుల అంచనా ప్రకారం చైనా వీధి దీపాలకయ్యే ఖర్చు సుమారు రూ.13 వేల కోట్ల వరకు తగ్గుతుంది. అలాగే 2022 నాటికల్లా ఇలాంటి కృత్రిమ చంద్రుడిని మరో మూడింటిని తయారు చేసి అంతరిక్షంలోకి పంపే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Next Story