600 మందిని బలి తీసుకున్న క‌రోనా.. ఆ అమ్మాయిని కాపాడింది

By Newsmeter.Network  Published on  7 Feb 2020 10:13 AM GMT
600 మందిని బలి తీసుకున్న క‌రోనా.. ఆ అమ్మాయిని కాపాడింది

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ వల్ల ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వందల మంది దీని బారీన పడి బ్రతుకు పోరాటం చేస్తున్నారు. కరోనా పేరు చెబితే చాలు వణికిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ కారణంగా ఓ మహిళ కామాంధుడి బారి నుండి తప్పించుకుందట.

చైనాలోని వుహాన్ సమీపంలో గల జింగ్షాన్ పట్టణంలో ఓ యువతి ఒంటరిగా నివసిస్తోంది. ఓ దొంగ ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. యువతిని బెదిరించి డబ్బు, నగలు తీసుకున్నాడు. ఇంట్లో యువతి ఒక్కతే ఉండడం గమనించాడు. అంతే.. అతనిలోని కామాంధుడు నిద్ర లేచాడు. ఆమె పై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. తన కోరిక తీర్చకపోతే చంపుతానని బెదిరించాడు.

అప్పుడు ఆ యువతి సమయస్ఫూర్తితో వ్యవహారించి దగ్గినట్లుగా నటించింది. దీంతో అతను ఏమైందని అడిగాడు. తాను కొద్దిరోజుల క్రితమే వుహాన్‌ నుంచి వచ్చానని.. తనకు కరోనా వైరస్ సోకడంతో కుటుంబ సభ్యులంతా తనను ఇంట్లో ఒంటరిగా వదిలేసి వేరేచోటు ఉంటున్నారని చెప్పింది. దెబ్బకు షాకైన ఆ కామాంధుడు ఆ యువతిని వదిలేసి బయటకు పరుగు లంకించుకున్నాడు. ఆ వెంటనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. మనుషులను చంపేస్తున్న కరోనా వైరస్.. ఓ యువతి జీవితాన్ని నిలబెట్టి మరోసారి వార్తల్లో నిలిచింది.

Next Story
Share it