2000కు చేరిన కోవిడ్ 19 మృతులు..ఒలంపిక్స్ పై ఎఫెక్ట్..!?

By రాణి  Published on  19 Feb 2020 6:52 AM GMT
2000కు చేరిన కోవిడ్ 19 మృతులు..ఒలంపిక్స్ పై ఎఫెక్ట్..!?

చైనాలో కరోనా మృత్యుతాండవం చేస్తోంది. తాజాగా అక్కడ కోవిడ్ -19(కరోనా వైరస్) మృతుల సంఖ్య 2000 దాటింది. ఈ మేరకు ఆ దేశ అధికారులు ప్రకటన చేశారు. బుధవారం హుబెయ్ ప్రావిన్సులో కోవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న వారిలో 136 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే కొత్తగా..1179 కోవిడ్ 19 కేసులు నమోదవ్వడంతో..వైరస్ బాధితుల సంఖ్య 74,185కు చేరింది. బాధితుల్లో 11,977 మంది పరిస్థితి ఆందోళకరంగా ఉన్నట్లు సమాచారం. కాగా..వైరస్ సోకినట్లుగా అనుమానించిన 5,248 మంది ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. మరోవైపు వైరస్ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుని..వ్యాధి నయమైన 14,376 మంది ఇళ్లకు చేరుకున్నారు. కానీ..వైరస్ సోకిన వారికి చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందిలో 1716 మందికి ఇదే వైరస్ రావడం ఆ దేశాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. హాంకాంగ్ లో 62, మకావులో 10, తైవాన్ లో 22 మంది కోవిడ్ 19 బారిన పడి..ఆస్పత్రుల పాలయ్యారు. వైరస్ ప్రభావంతో హాంకాంగ్ లో ఇద్దరు, ఫ్రాన్స్, జపాన్, ఫిలిప్పీన్స్, తైవాన్ లలో ఒక్కొక్కరు మరణించారు.

కోవిడ్ - 19 భయంతో 14 రోజులుగా జపాన్ తీరంలో నిలిచిపోయిన డైమండ్ ప్రిన్సెన్స్ నౌకలో ఉన్నవారికి విముక్తి లభించింది. నౌకలో ఉన్నవారికి వైద్య పరీక్షలు చేయగా..542మందికి వైరస్ సోకినట్లు నిర్థారణయింది. కోవిడ్ 19 ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. దీని కారణంగానే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థపై కూడా దెబ్బపడుతోంది. ముఖ్యంగా..వివిధ వస్తువుల తయారీకి స్పేర్ పార్ట్ లను సరఫరా చేసే..చైనానే కోలుకోలేని వైరస్ బారిన పడటంతో..అక్కడి నుంచి ఎగుమతులను నిలిపివేసింది. సంబంధ కంపెనీలు కొద్దిరోజుల వరకూ మూతపడ్డాయి. ఇండియా సహా వివిధ దేశాలు ఈ వైరస్ నుంచి పరోక్షంగా దెబ్బతిని..వ్యాపారాలు చేయలేక మిన్నకుండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

టోక్యోలో జరగనున్న 2020 ఒలింపిక్స్ పై కోవిడ్ 19 ప్రభావం ఉంటుందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించిన యూఎన్ ఏజెన్సీ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ మైకేల్ ర్యాన్ మాట్లాడుతూ..ఒలింపిక్స్ నిర్వహణకు సంబంధించి ఇప్పుడే ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదని తెలిపారు. కానీ..కోవిడ్ - 19 ముప్పును అంచనా వేయడంలో మాత్రం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి సహకరిస్తామన్నారు.

Next Story