లాక్‌డౌన్‌లో భారీగా పెరిగిన బాల్య వివాహాలు: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌

By సుభాష్  Published on  29 Aug 2020 1:31 AM GMT
లాక్‌డౌన్‌లో భారీగా పెరిగిన బాల్య వివాహాలు: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌

కరోనా కాలంలో వివాహం చేసుకునే వారికి ఎన్నో ఇబ్బందులు తలెత్తాయి. ముహూర్తాలు కుదుర్చుకున్న కొందరు పది, పదిహేను మందితోనే పెళ్లి జరుపుకొంటున్నారు. ఈ మాట అటుంచితే.. సందట్లో సడేమియా అన్నట్లు ఈ కరోనా కాలంలో కర్ణాటక రాష్ట్రంలో బాల్య వివాహాల సంఖ్య పెరిగిపోయిందని ఆ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ వెల్లడించింది.

గుట్టుచప్పుడు కాకుండా చిన్నారులకు పెళ్లిళ్లు చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారని తెలిపింది. గత ఐదు నెలల్లో కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా భారీగా బాల్య వివాహాలు జరిగినట్లు కమిషన్‌ గుర్తించింది.

ఏప్రిల్‌ నుంచి జూలై వరకు 107 బాల్య వివాహాలు

గత ఏప్రిల్‌ నుంచి జూలై వరకకు 107 మందికి పెళ్లిళ్లు జరిగినట్లు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ గుర్తించింది. 2019లో మొత్తం 156 జరుగగా, 2020 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు కేవలం ఐదు నెలల్లోనే ఈ స్థాయిలో ఉండటం గమనార్హం.

అధికారులంతా కరోనా చర్యల్లో ఉన్న సమయంలో అధికారుల దృష్టికి ఇవి రాలేదని, దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటూ బాల్య వివాహాలు జరిపిస్తున్నారని కమిషన్‌ తెలిపింది. బళ్లారి, మైసూర్‌, బాగల్‌కోట్‌, బెళగావి, ధార్వాడ్‌ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోనే వీటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది.

కరోనా లక్షణాలు లేకున్నా పరీక్షలు చేయించుకోవాల్సిందే: WHO

కాగా, లాక్‌డౌన్‌లో పాఠశాలలు మూతపడటం ఈ బాల్య వివాహాలకు కారణమని తెలిపింది. అయితే మార్చి నుంచి జూలై వరకు 550 బాల్య వివాహాలు ఆపగలిగామని బాలల పరిరక్షణ కమిషన్‌ అధికారులు వెల్లడించారు. గతంలో పెళ్లిళ్లు జరగాలంటే లక్షల్లో ఖర్చు అయ్యేదని, లాక్‌డౌన్‌ కారణంగా పెద్దగా ఖర్చు లేకుండా పోవడంతో బాల్య వివాహాల ఘటనలు బయటకు రాలేదన్నారు.

తక్కువ ఖర్చు కారణంగా బాల్య వివాహాలు

లాక్‌డౌన్‌ సమయంలో పాఠశాలల,కళాశాలలు మూసి ఉండటం వల్ల బాలికల హాజరును పర్యవేక్షించడం అసాధ్యమని అన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో తల్లిదండ్రులు వారి తక్కువ వయసు గల ఆడ పిల్లలకు వివాహం చేయించేందుకు ఈ మార్పులన్నింటిని ఉపయోగించారన్నారు. గత ఏడాది బాల్య వివాహాల సంఖ్యతో పోలిస్తే ఈ ఈ ఏడాది ఐదు నెలల్లో ఆ సంఖ్య రెట్టింపు అయినట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో కుమార్తెల వివాహం చేయడానికి తల్లిదండ్రులకు తక్కువ ఖర్చు కావడం ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. ఇలాంటి సమయంలో వారికి లాక్‌డౌన్‌ ఉపయోగపడిందని ఆ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ వెల్లడించింది..

Next Story
Share it