పిల్లల ఏడుపులో భావాలు మీకు తెలుసా..?
By సుభాష్ Published on 16 March 2020 8:59 AM GMTసాధారణంగా పిల్లలు ఏడవడం మనం చూస్తూనే ఉంటాము. ఒక్కో సమయంలో పిల్లలు ఏకదాటిగా ఏడుస్తూనే ఉంటారు. వారు ఎందుకు అతిగా ఏడుస్తున్నారో చెప్పలేని పరిస్థితి. దాంతో మనం కూడా చాలా కంగారు పడుతుంటాము. ఏదో చిట్కాలు చేయబోతాం.. కానీ వారు ఏడుపు మాత్రం మానరు. పసి పిల్లలు ఎక్కువగా ఏడుస్తూ ఉండటం సహజమే. పసి పిల్లలు రోజుకు మూడు గంటల పాటు ఏడుస్తారని చైల్డ్ సైకాలజీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పిల్లలు అలా ఏడవడం వల్ల ప్రయోజనముంది. అలా ఏడవడమే వారి భాషగా మారుతుందట. ఏడవడం ద్వారానే పిల్లలు వారికి కావాల్సినవి తెలియజేస్తారని పరిశోధకులు చెబుతున్నారు.
పిల్లలకు ఆకలిగా ఉన్నప్పుడు కొంచెం పెద్దగా మధ్యలో విరామం ఇవ్వకుండా ఏడుస్తారు. పిల్లలకు అసౌకర్యంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను సైతం హడలెత్తించి బిగ్గరగా ఏడుస్తూనే ఉంటారు. ఇలా విడవని ఏడుపునకు ఏ కడుపునొప్పో, చెవినొప్పో కారణం కావచ్చు. అలాంటి సమయంలో వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి.
అలాగే పిల్లలు ఏమీ తోచక తల్లిదండ్రులను వాళ్ల దగ్గరకు రప్పించుకోవాలనే భావంతో ఏడుస్తారు. ఇలా ఏడ్చేది తాపీగా మధ్య మధ్యలో అపుతూ 'ఉ..ఊ' అంటూ ఏడుస్తారు. ఇలాంటి ఏడుపును పసిగట్టిన తల్లులు వెంటనే ఉయ్యాల దగ్గరకు వెళ్లి ఎత్తుకుని ఆడించకుండా నాలుగైదు నిమిషాలు ఆగి వెళ్లాలి. లేకపోతే చంటి పిల్లలైనా అదే అలుసుగా తీసుకుని పదే పదే ఏడుస్తూనే ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
పిల్లల ఏడుపుల్లో చాలా కారణాలు
ఇంకా పిల్లల ఏడుపుల్లో చాలా కారణాలున్నాయంటున్నారు బాలల మనస్తత్వ శాస్త్రవేత్తలు. పిల్లల ఏడుపును గ్రహించాల్సి ఉంటుంది. ఈ తేడాలను గుర్తించలేకపోయినా తల్లులు వెంటనే స్పందించి వారెందుకు ఏడుస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ లాలిస్తే, తల్లి తనను కనిపెట్టుకునే ఉందనే ఆత్మవిశ్వాసం కలుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. చంటి పిల్లలకు ఒకటి, రెండు నెలల నుంచే తల్లి ప్రత్యేక శ్రద్ద చూపిస్తూ ఏడ్చిన వెంటనే లాలిస్తూ, బుజ్జగిస్తూ.. సన్నగా పాట పాడుతూ నిద్రపోయేలా చేయాలి. సన్నగా సంగీతాన్ని వినిపించడం వల్ల కూడా పిల్లలు ఏడుపుమాని నిద్రలోకి జారుకుంటారు. అతిగా ఏడుస్తూ నిద్రపోని పిల్లలను వైద్యుల వద్దకు తీసుకెళ్లాలని పిల్లల తల్లిదండ్రులకు సూచిస్తున్నారు నిపుణులు.