ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఒక మావోయిస్టు, ఇద్దరు జవాన్లు మృతి.. మరో ఏడుగురు..

By సుభాష్  Published on  10 Feb 2020 11:09 AM GMT
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఒక మావోయిస్టు, ఇద్దరు జవాన్లు మృతి.. మరో ఏడుగురు..

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. బీజాపూర్‌ జిల్లా ఇరపల్లిలో పోలీసులు - మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు హతం కాగా, ఇద్దరు సీఆర్పీఎఫ్‌ కోబ్రా బెటాలియన్‌కు చెందిన జవాన్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే డిప్యూటీ కమాండర్‌తో సహ నలుగురు సీఆర్పీఎఫ్‌ సిబ్బందికి కూడా నలుగురికి గాయాలయ్యాయి. ఈ కాల్పులతో భయాందోళన వాతావరణం నెలకొంది.

దీంతో భారీగా పోలీసుల బలగాలు ఘటన స్థలానికి చేరుకుని మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఎస్పీ, సీఆర్‌పీఎఫ్‌ డీఐజీ సమక్షంలో ఏడుగురు మావోయిస్టులు లొంగిపోయినట్లు సమాచారం. వీరిపై రూ.9 లక్షల రివార్డు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలంలో తుపాకులు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కొన్ని అటవీ ప్రాంతాలు మావోయిస్టులకు అడ్డాగా మారాయి. ఈ ప్రాంతాల్లో అధికంగా గిరిజన ప్రాంతాలు ఉండటంతో పెద్దగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఈ ప్రాంతాల్లో జరిగే రోడ్డు పనులు, వంతెన పనులకు మావోయిస్టులు అడ్డుతగులుతూ ప్రభుత్వ వాహనాలను సైతం దగ్ధం చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఎన్నో సార్లు కూడా కాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టులకు అడ్డాగా మారడంతో పోలీసుల బలగాలు ప్రత్యేక నిఘా ఉంచారు. ప్రభుత్వ అభివృద్ది పనులకు అడ్డుపడుతున్న మావోయిస్టుల కోసం ప్రతిక్షణం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు.

Next Story
Share it