ప్ర‌యాణికుల‌కు విజ్ఞ‌ప్తి : ఏపీ ఎక్స్‌ప్రెస్ ప్ర‌యాణ‌ వేళల్లో మార్పులు.!

By Medi Samrat  Published on  23 Oct 2019 9:03 AM GMT
ప్ర‌యాణికుల‌కు విజ్ఞ‌ప్తి : ఏపీ ఎక్స్‌ప్రెస్ ప్ర‌యాణ‌ వేళల్లో మార్పులు.!

విశాఖపట్నం-న్యూఢిల్లీ న‌డిచే ఏపీ ఎక్స్‌ప్రెస్ ప్ర‌యాణ‌ వేళల్లో మార్పులు చేసింది రైల్వే శాఖ‌. ఈ మేరకు కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలు వేళలు మార్చాలన్న సిఫారసుల మేరకు రైల్వే శాఖ‌ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త షెడ్యూల్ వచ్చే ఏడాది జనవరి 23వ తేదీ నుంచి అమలులోకి రానుంది.

కొత్త షెడ్యూల్ ప్రకారం.. విశాఖలో ప్రతీ రోజూ రాత్రి 10గంటలకు ఏపీ ఎక్స్‌ప్రెస్ బయలుదేరుతుంది. దాదాపు 33గంటల ప్రయాణంతో మూడో రోజు ఉదయం 6.35గంటలకు న్యూఢిల్లీకి చేరుకుంటుంది. అలాగే.. ఢిల్లీలో ప్రతీరోజూ రాత్రి 8.15గంటలకు బయలుదేరి.. మూడో రోజు ఉదయం 5.05గంటలకు విశాఖ చేరుతుంది.

ఇదిలావుంటే.. రాష్ట్ర విభజనకు ముందు ఏపీ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్-ఢిల్లీ మధ్య నడిచిన సంగతి తెలిసిందే. విభజన తర్వాత హైదరాబాద్-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌ను తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. 2015లో విశాఖ-ఢిల్లీ మధ్య ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.

Next Story
Share it