ఒక్క ఛాన్స్ అంటూ వచ్చారు.. వచ్చాక 'మరణశాసనం' రాస్తున్నారు.!
By న్యూస్‌మీటర్ తెలుగు
విజయవాడ: రాష్ట్రంలో ఇసుక కొరతతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నిరసన దీక్ష చేపట్టారు. దీనిలో భాగంగానే ఇవాళ ఉదయం 8 గంటల నుంచి విజయవాడ ధర్నా చౌక్‌లో చంద్రబాబు దీక్షకు కూర్చున్నారు. ఈ దీక్ష సాయత్రం వరకు కొనసాగనుంది.
చంద్రబాబు దీక్షకు మద్దతుగా జనసేన, బీజేపీ, వామపక్షాలు సంఘీభావం తెలిపాయి. దీక్షకు భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాల నేతలు తరలివచ్చారు. అయితే ఈ రోజు బాలల దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నెహ్రూ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మహాత్మా గాంధీ, ఎన్టీఆర్ చిత్రపటాలకు చంద్రబాబు నివాళులర్పించారు.అలాగే ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు చంద్రబాబు నివాళులర్పించారు.
అనంతరం ఈ దీక్షలో మాట్లాడిన చంద్రబాబు.. ఎన్నికల సమయంలో ఒక్క ఛాన్స్.. ఒక్క ఛాన్స్ అంటూ.. జగన్ ప్రజలను ఓట్లడిగారు. కానీ.. ప్రజలు అవకాశం ఇచ్చాక జగన్ వారి మరణశాసనం రాస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో మాత్రమే ఇసుకను కబ్జా చేశారని ఆరోపించారు. ఏపీ ఇసుక తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలో దొరుకుతోందని ఆరోపించారు. దీంతో రాష్ట్రంలో కృత్రిమ ఇసుక కొరత సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు, కార్యకర్తలే ఇసుకను దోచేస్తున్నారని.. ఇసుకను దోచేస్తున్న ఇంటి దొంగలు జగన్‌కు కనపడరా అంటూ ప్రశ్నించారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని జగన్ సర్కార్‌పై చంద్రబాబు విరుచుకుపడ్డారు.