ఏపీలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా శనివారం మండల టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..ఒక్క అవకాశమిస్తే జగన్ ఉన్నవన్నీ ఊడగొట్టారని, ఇప్పటికే పేదల సంక్షేమ పథకాలను రద్దు చేశారని మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి విధ్వంసం సృష్టించిన జగన్..మళ్లీ గెలిస్తే ఇక రాష్ర్టంలో ఏమీ మిగలనివ్వరని అసంతృప్తి చెందారు. ఓటమి భయంతోనే మంత్రుల ఉద్యోగాలు పీకేస్తానంటూ జగన్ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 38 ఏళ్ల టీడీపీ చరిత్రలో ఎన్నో ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పిన చంద్రబాబు..రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో వీరోచితంగా పోరాడాలంటూ నేతలకు దిశా నిర్దేశం చేశారు. అన్ని చోట్ల స్ఫూర్తిదాయకమైన నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని..వారి కోరికమేరకు టీడీపీ ఆ దిశగా కృషి చేయాలన్నారు. అలాగే కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తూనే రాష్ర్టంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో అందరూ ధైర్యంగా పోరాడి వైసీపీ కథ తేల్చాలన్నారు. ఆత్మవిశ్వాసమే ధ్యేయంగా రాష్ర్టాన్ని కాపాడుకోవడమే అందరి లక్ష్యమన్నారు.

రాణి యార్లగడ్డ

Next Story