నన్ను ఎన్ కౌంటర్ చేయండి : పోలీసులతో చంద్రబాబు

By రాణి  Published on  27 Feb 2020 10:38 AM GMT
నన్ను ఎన్ కౌంటర్ చేయండి : పోలీసులతో చంద్రబాబు

విశాఖ విమానాశ్రయం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉదయం నుంచి టీడీపీ - వైసీపీ నేతల మధ్య నెలకొన్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఎయిర్ పోర్ట్ వద్ద కాన్వాయ్ లోకి ఎక్కినప్పటి నుంచి వైసీపీ శ్రేణుల ఆందోళన మరింత ఎక్కువైంది. కొందరు కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేయగా..మరికొందరు కాన్వాయ్ పై కోడిగుడ్లు, చెప్పులు, టమోటాలు విసిరి అల్లర్లు సృష్టించారు. బాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. సుమారు రెండు గంటల సేపు కారులోనే కూర్చున్న చంద్రబాబు..సహనం నశించడంతో కారు దిగి రోడ్డుపై బైఠాయించారు.

చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు, చినరాజప్ప, పంచుమర్తి అనురాధలు కూడా రోడ్డుపై కూర్చుని వైసీపీ తీరుకు నిరసన తెలిపారు. చంద్రబాబు తిరిగి వెనక్కు పంపించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యారు. సుమారు 100 మంది పోలీసులతో రోప్ పార్టీతో పాటు చంద్రబాబు కాన్వాయ్ వద్ద వాహనాన్ని సిద్ధం చేశారు. తమకు సహకరించాలని..తిరిగి వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు చంద్రబాబును కోరినప్పటికీ..వారి విన్నపాన్ని చంద్రబాబు సున్నితంగా తిరస్కరించారు. తాను శాంతియుతంగా నిరసన తెలుపుతున్నానని..తనను అడ్డుకోవద్దని సూచించారు.

మూడున్నర గంటలుగా అక్కడే ఉన్న చంద్రబాబు..పోలీసుల తీరుకు విసిగిపోయి వారిపై ఫైరయ్యారు. ''నన్ను షూట్ చేయండి. ఎన్ కౌంటర్ చేయండి.. యాత్రకు పర్మిషన్ ఉంటే అడ్డుకుంటారా ? ఏ చట్టం ప్రకారం నన్ను తిరిగి వెనక్కి వెళ్లమంటున్నారో చెప్పండి.. మమ్మల్ని రోడ్డుపై నిలబెట్టి ఎందుకు ఆపుతున్నారో చెప్పండి '' అంటూ పోలీసులను ప్రశ్నించారు.

విశాఖ విమానాశ్రయం వద్దనున్న టీడీపీ నేతలను ఒక్కొక్కరిగా తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు ఇదే విశాఖ విమానాశ్రయంలో జగన్ కు ఎదురైన పరిస్థితే..ఇప్పుడు చంద్రబాబుకూ వచ్చింది. చంద్రబాబు పై కక్షతోనే సీఎం వైఎస్ జగన్ ఇలా చేయిస్తున్నాడంటూ తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story