అందుకే.. సురేంద్ర బాబును తప్పించారు..!- టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Sep 2019 9:10 AM GMT
అమరావతి: టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ ప్రభుత్వం ఇంత తక్కువ కాలంలో అప్రతిష్ట పాలు కాలేదన్నారు. టీడీపీ నేతలపై బురద చల్లాలని చూసి.. సీఎం జగనే పూసుకుంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. పీపీఏలపై హైకోర్ట్ తీర్పు, కేంద్ర మంత్రి లేఖలే దీనికి నిదర్శనమన్నారు. పోలవరం ద్వారా దోపిడీకి శ్రీకారం చుట్టారన్నారు. పోలవరంలో రివర్స్‌టెండరింగ్ ద్వారా రూ.750 కోట్లు తగ్గించామని చెప్పుకుని..రూ.7,500 కోట్లు నష్టం చేకూర్చారన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల క్విడ్ ప్రొకోలో భాగంగానే..పోలవరంలో గతంలో ఎక్కువ కోట్ చేసిన సంస్థలు..ఇప్పుడు తక్కువ కోట్ చేశాయన్నారు. 'మెఘా'కు ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవని సురేంద్ర బాబు చెబితే..ఆయనను తప్పించారన్నారు. ప్రజలను మభ్య పెట్టి దోచుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇసుక కొరత వలన 20లక్షల మంది బాధ పడుతున్నారని చెప్పారు. టీటీడీని వివాదాల ఆలయంగా మార్చారని బాబు మండిపడ్డారు.