ఏంటీ అరాచకం?

By రాణి  Published on  22 Jan 2020 6:38 AM GMT
ఏంటీ అరాచకం?

ముఖ్యాంశాలు

  • చంద్రబాబుని సాధారణమైన వ్యాన్ లో తరలించిన పోలీసులు
  • అమరావతి క్యాపిటల్ రీజియన్ లోని కచ్చారోడ్లపై ప్రయాణం
  • నేరుగా బాబుని మంగళగిరి పోలీస్టేష్ కి తీసుకెళ్లిన పోలీసులు
  • జెడ్ కేటగిరీ భద్రతను విస్మరించారంటూ తెదేపా నేతల ఆగ్రహం
  • వందలాదిగా మంగళగిరి పోలీస్టేషన్ కి తరలివచ్చిన కార్యకర్తలు
  • చంద్రబాబుని తన కారులో ఎక్కేందుకు అనుమతించిన పోలీసులు
  • నేరుగా ఉండవల్లిలోకి తన ఇంటికి వెళ్లిపోయిన చంద్రబాబు

ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశపూర్వకంగానే తీవ్రాతి తీవ్రమైన స్థాయిలో ప్రభుత్వం అవమానిస్తోందని తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి అనికూడా చూడకుండా అత్యంత సాధారణంగా ఆయన్ని అతి సాధారణమైన పోలీస్ వ్యాన్ లో తీసుకెళ్లారని, కనీసం భద్రత విషయంలో సామాన్యమైన ఏర్పాట్లు కూడా చేయలేదని ధ్వజమెత్తుతున్నారు. ఉద్దేశ పూర్వకంగానే చంద్రబాబుని కూర్చోపెట్టిన వ్యాన్ ని అమరావతి క్యాపిటల్ రీజియన్ లోని బాగా ఎత్తుపల్లాలు, గుంటలు ఉన్న రోడ్లమీద నుంచి పోనిచ్చారని, చంద్రబాబు వయసును, ఆరోగ్యాన్నికూడా ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా ఇంత దారుణంగా వ్యవహరించడం ఈ ప్రభుత్వానికి తగదని తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు.

అమరావతికోసం భూమిని ఇచ్చిన రైతులు ఉద్యమించిన సందర్భంలో వారికి మద్దతు తెలుపుతూ పెద్ద ఎత్తున బాబు నిరసన ప్రదర్శన చేపట్టిన నేపధ్యంలో ఈ సంఘటనలన్నీ జరిగాయి. సినీ ఫక్కీలో హై డ్రామాకు తెరలేపుతూ చంద్రబాబు నిరసన ప్రదర్శనకు దిగారు. కానీ నిజానికి ఆ ప్రదర్శనకు ఎలాంటి అనుమతీ లేదు. ఈ నేపధ్యంలో పోలీసులు ఆయన్ని బలవంతంగా అక్కడినుంచి తప్పించక తప్పలేదు. పోలీసులు నేరుగా చంద్రబాబుని కచ్చారోడ్లమీద మంగళగిరి పోలీస్టేషన్ కి తరలించారు. చంద్రబాబుకు అసాంఘిక శక్తులనుంచి ముప్పు పొంచి ఉన్నందున ముందస్తు తనిఖీలు చెయ్యకుండా ఎలా పడితే అలా కచ్చారోడ్లు, మారుమూల ప్రాంతాలు తిప్పుతూ తీసుకెళ్లడానికి వీల్లేదన్న విషయాన్నికూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో విస్మరిస్తోందని తెదేపా నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

క్షణాల్లో దావానలంలా అంతటా పాకిపోయిన వార్త

చంద్రబాబుని మంగళగిరి పోలీస్టేషన్ కి తరలించారన్న వార్త దావానలంగా వ్యాపించింది. క్షణాల్లో తెదేపా నేతలు, కార్యకర్తలు వందల సంఖ్యలో మంగళగిరి పోలీస్టేషన్ కి చేరుకుని పెద్దపెట్టున నినాదాలు చేశారు. పోలీసుల్ని చంద్రబాబుని పోలీస్టేషన్ లోపలికి తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. ఒక దశలో మంగళగిరి పోలీస్టేషన్ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంత సేపటి తర్వాత తర్జనభర్జనల అనంతరం పోలీసులు చంద్రబాబుని తన సొంత కారులో కూర్చోవడానికి అనుమతించారు. అప్పుడు కాన్వాయ్ తో సహా చంద్రబాబు ఉండవల్లిలో ఉన్న తన నివాసానికి వెళ్లిపోయారు. జెడ్ క్యాటగిరీ భద్రత ఉన్న ప్రతిపక్షనేతలు ఈ విధంగా కావాలని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టడం, సెక్యూరిటీ లేకుండానే మారుమూల ప్రాంతాల్లోని కచ్చారోడ్లపై కావాలని తీసుకెళ్లడం తీవ్రస్థాయిలో గర్హంచదగిన పరిణామాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కళావెంకట్రావ్ అంటున్నారు. తప్పనిసరిగా భవిష్యత్తులో దీనికి దీటైన సమాధానం చెప్పి తీరతామంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Next Story