ఈ ముఖ్యమంత్రికి రైతుల ప్రాణాలంటే లెక్కలేదు

By రాణి  Published on  6 Jan 2020 9:24 AM GMT
ఈ ముఖ్యమంత్రికి రైతుల ప్రాణాలంటే లెక్కలేదు

  • ఫార్మా హబ్ గా విశాఖ, హార్డ్ వేర్ హబ్ గా తిరుపతి

టీడీపీ నేత గద్దె రామ్మోహనరావు అమరావతి కోసం చేపట్టిన దీక్షకు మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విజయవాడ రాజకీయ చైతన్యానికి మారుపేరన్నారు. మన ప్రాంతంలో ఉండే పిల్లలు ఉద్యోగాల కోసం ఇతరత్రా ఊళ్లకు వెళ్లకూడదన్న ఉద్దేశ్యంతోనే అమరావతికి శ్రీకారం చుట్టామన్నారు. విశాఖను ఫార్మా హబ్, పర్యాటక కేంద్రంగా మార్చాలని అనుకున్నామని చంద్రబాబు తెలిపారు. రాయలసీమకు అనేక పరిశ్రమలను తీసుకొచ్చినట్లే..తిరుపతిని హార్డ్ వేర్ హబ్ గా మార్చాలనుకున్నామని తెలిపారు. ఎప్పటికైనా రాష్ట్రానికి సంపదనిచ్చే నగరం అమరావతేనన్నారు. ఈ ముఖ్యమంత్రికి రైతుల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయిందని, ఐకాస లు పెట్టి అమరావతి కోసం పోరాడుతున్నా కనీసం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.

అధికారంలో ఉన్న మంత్రులు రోజుకొకలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నా మీద ఉన్న కోపాన్ని అమరావతిపై చూపించవద్దన్నారు. ఇప్పటి వరకూ ఇక్కడ అన్ని భవనాలు ఉన్నాయని, ఒక్క పైసా కూడా ఖర్చుపెట్టాల్సిన పనిలేదన్నారు. కమిటీల పేరుతో వైసీపీ నేతలు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనుకుంటే దర్యాప్తు చేయండి..అంతేగానీ తప్పుడు సమాచారాలను నమ్మి సమయాన్ని వృథా చేయొద్దని కోరారు. అమరావతిలో పునాదులకు ఎక్కువ ఖర్చు అనేది తప్పుడు ప్రచారమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నాగరికత నదుల పక్కనే వెలిసిందని ఆయన మరోసారి గుర్తు చేశారు.

అలాగే అమరావతికి జరుగుతున్న అన్యాయంపై అన్ని విపక్ష పార్టీలు గళమెత్తాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ర్ట ప్రజలు కోరుకునేది అభివృద్ధిని గానీ...మూడు రాజధానులను కాదన్నారు. రాజధాని కోసం పోరాడుతున్న పెద్దలు, రైతులకు యువత, విద్యార్థులు మద్దతివ్వాలని కోరారు. కేసులు పెడతారేమోనని భయపడి విద్యార్థులు వెనకడుగు వేయొద్దని సూచించారు. ధైర్యంగా పోరాడగలిగితే ప్రజల్లో మిగిలిపోతామన్నారు.

Next Story