జాతీయ మీడియా ప్రతినిధులతో బాబు భేటీ..ఎందుకు? ఏం మాట్లాడారు..?!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Oct 2019 2:02 PM GMT
జాతీయ మీడియా ప్రతినిధులతో బాబు భేటీ..ఎందుకు? ఏం మాట్లాడారు..?!

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం అయ్యి 150 రోజులు దాటింది. మేనిఫెస్టోలో ఉన్న హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. క్షేత్రస్థాయిలో వైఎస్ జగన్ పాలనపై కాస్త వ్యతిరేకత ఉంది, కాస్త సానుకూలత ఉందీ. వచ్చే స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ, టీడీపీ హోరాహోరీగా తలపడే అవకాశముంది. దీంతో చంద్రబాబు అలర్ట్ అయినట్లు కనిపిస్తోంది. తన అమ్ములపొదిలోని మీడియా అస్త్రాన్ని చంద్రబాబు మరోసారి బయటకు తీశారు. ఇప్పటి వరకు తనకు మద్దతుగా ఉన్న తెలుగు ఛానళ్ల అధినేతలతో చంద్రబాబు మాట్లాడినట్లు సమాచారం. అంతేకాదు..హైదరాబాద్‌లో ఉన్న జాతీయ మీడియా ప్రతినిధులతో కూడా దీపావళికి రెండు రోజుల ముందు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.

అక్టోబర్ 25 అర్ధరాత్రి చంద్రబాబు జాతీయ మీడియా చానళ్ల ప్రతినిధులతో రహస్య భేటీ నిర్వహించినట్లు తెలుస్తోంది. దీపావళికి ప్రత్యేక కానుకుల పేరుతో వారిని పిలిపించుకుని మాట్లాడినట్లు సమాచారం. ఇది..కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ..ఏపీ సర్కార్‌పై వ్యకతిరేక కథనాలు వండివార్చాలని జాతీయ మీడియా ప్రతినిధులను బాబు కోరినట్లు తెలుస్తోంది. అదే సమయంలో టీడీపీ గురించి సానుకూలంగా రాయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేసినట్లు మీడియా వర్గాల్లో చెప్పుకుంటున్నారు.

పవన్ కల్యాణ్ విశాఖపట్నం ధర్నాకు హైదరాబాద్ నుంచి జాతీయ మీడియా తీసుకొచ్చే బాధ్యతను బాబు ఓ కీలక వ్యక్తికి అప్పగించినట్లు చెప్పుకుంటున్నారు. జాతీయ చానళ్లు ప్రసారం చేసిన వెంటనే టీడీపీ సోషల్ మీడియాకు లింక్‌లు పెట్టాలని కూడా బాబు సూచించినట్లు చెబుతున్నారు. జాతీయ జెండా రంగుల వివాదంతోపాటు, ఇసుక, అమరావతి నిర్మాణం, పరిశ్రమల తరలింపు వంటి వాటిపై వ్యతిరేక కథనాలు ప్రసారం చేయాలని టీడీపీ అధినేత జాతీయ ఛానళ్ల ప్రతినిధులను కోరినట్లు తెలుస్తోంది.

అంతేకాదు..ప్రతి నెలా హైదరాబాద్ లోని తన నివాసం లో కలుద్దామని జాతీయ చానెళ్ల ప్రతినిధులకు టీడీపీ అధినేత హామీ ఇచ్చినట్లు కూడా సమాచారం . ఇప్పటికే తెలుగు ఛానళ్ల యాజమాన్యాలతో చంద్రబాబు ఈ విషయాలే చర్చించినట్లు సమాచారం. తమ ఆలొచనలకు అనుగుణంగా ప్రసారాలు చేసే ఛానళ్లకు పార్టీ తరపు నుంచి నిధులు కేటాయిస్తున్నట్లు కూడా బాబు అన్నట్లు చెప్పుకుంటున్నారు.

మొత్తానికి చంద్రబాబు నాయుడు తన మీడియా మేనేజ్‌మెంట్‌కు మరోసారి పదును పెడుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అనుభవరాహిత్యంతో చేస్తున్న తప్పులను బాగా ఫోకస్ చేయాలని పార్టీ నేతలకు, తనకు మద్దతు ఇచ్చే మీడియాకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని సమాచారం.

  • వై.వి.రెడ్డి, న్యూస్ ఎడిటర్, న్యూస్ మీటర్

Next Story
Share it