చంద్రబాబు నివాసం ఉంచుతారా? కూల్చుతారా?..!
By న్యూస్‌మీటర్ తెలుగు
- చంద్రబాబు నివాసం కూల్చివేతకు రంగం సిద్దం
- వారం రోజులే సమయం: సీఆర్డీఏ డెడ్ లైన్
అమరావతి: రాజకీయ దుమారానికి కారణమైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది. గతంలోనే అక్రమంగా నిర్మించిన ఈ నివాసాన్ని ఎందుకు తొలిగించ కూడదంటూ స్థానిక అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై అన్ని పత్రాలు సమర్పిస్తామని భవన యజమానులు అధికారులకు హామీ ఇచ్చారు. సమయం ముగిసిన పత్రాలు ఇవ్వకపోవడంతో మరోసారి సీఆర్‌డీఏ అధిరాకారులు చంద్రబాబు నివాసం ఉంటున్న భవనానికి నోటీసులు అంటించారు.
వారంలోగా చంద్రబాబు ఉంటున్న నివాసాన్ని తొలిగించాలని..లేకుంటే తామే తొలిగిస్తామంటూ సీఆర్డీఏ అధికారులు ఆ ఇంటికి నోటీసులు అంటించారు. భవన యజమాని లింగమనేని రమేష్ పేరుతో అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు దీని పైన ఆ ఇంట్లోనే నివాసం ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ రియాక్ట్ అవుతారా..? రియాక్ట్ అయితే ఏవిధంగా అవుతారు..? తిరిగి ఇది రాజకీయంగా ఎటువంటి టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
స్పందించిన లింగమనేని
వారం రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలని సీఆర్డీఏ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్‌ఫ్లోర్, స్విమ్మింగ్‌పూల్, ఫస్ట్‌ఫ్లోర్‌లోని డ్రెసింగ్ రూమ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని సీఆర్డీఏ అధికారులు తెలిపారు. దీనిపై లింగమనేని రమేష్ స్పందించారు. ఇంటి నిర్మాణ సమయానికి సీఆర్డీఏ లేదని చెప్పారు. ఉండవల్లి పంచాయతీ అనుమతి తీసుకుని ఇంటిని నిర్మించామన్నారు. స్విమ్మింగ్‌పూల్‌కి రివర్ కన్సర్వేటర్ అనుమతి ఉందని లింగమనేని రమేష్ వెల్లడించారు.