బీసీజీ నివేదిక అంతా ఒక బూటకం : చంద్రబాబు

By రాణి  Published on  4 Jan 2020 2:28 PM IST
బీసీజీ నివేదిక అంతా ఒక బూటకం : చంద్రబాబు

బోస్టన్ కమిటీ అంతా బూటకమని ధ్వజమెత్తారు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ...రాజధాని కోసం భూములిచ్చిన 29 వేల మంది రైతులు మనోవేదనతో ఉంటే..అధికార పార్టీ బోస్టన్ కమిటీ..జీఎన్ రావు నివేదిక అంటూ నాటకాలాడుతోందని విమర్శించారు. బోస్టన్ కమిటీకి అసలు తలా తోక లేదని, అవినీతి అభియోగాలున్న సంస్థ చేతిలో రాష్ర్ట భవిష్యత్తును పెట్టి వైసీపీ వ్యాపారం చేస్తోందని దుయ్యబట్టారు. బోస్టన్ కమిటీ ఇచ్చిన నివేదిక అంతా తప్పేనని, ఆ కన్సల్టెన్సీ గ్రూప్ క్లయింట్ వద్ద డబ్బులు తీసుకుని వారు ఏది చెప్తే..అది రాసిచ్చే సంస్థ అని విమర్శించారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం నాటకాలు ఆపి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

తలా తోక లేని బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ను రాజధానిపై నివేదిక ఇవ్వమని అడిగే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి బోస్టన్ గ్రూప్ తో సంబంధాలున్నాయని, కేవలం స్వార్థం కోసమే బీసీజీ నివేదిక అంటూ తప్పుడు సమాచారాలిచ్చి ప్రజలను మోసం చేయడం పద్ధతి కాదని హెచ్చరించారు. ప్రభుత్వం చేతకానితనం వల్ల రాష్ర్టంలో ఇద్దరు రైతులు చనిపోయారన్నారు. దొండపాడులో మల్లికార్జునరావు అనే రైతు గుండెపోటుతో చనిపోగా..తిరుపతిలో మరో రైతు చనిపోయారని చంద్రబాబు తెలిపారు. అలాగే శుక్రవారం మందడంలో రాజధానిని తరలించవద్దని ధర్నా చేస్తున్న మహిళలపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించారు. రాజధాని కోసం వేల ఎకరాల భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైనే ఉందని, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

రాజధాని అవ్వాల్సిన అన్ని అనుకూలతలు, అర్హతలు అమరావతికి ఉన్నా జగన్ తప్పుడు నివేదికలు సృష్టించి...ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నాడని ఎద్దేవా చేశారు చంద్రబాబు. విశాఖను రాజధానిని చేస్తే అక్కడున్న వారి భూముల విలువలు పెరుగుతాయని, అందుకే ఇలా మూడు రాజధానులంటూ గుంటనక్క వేషాలేస్తున్నారని దుయ్యబట్టారు.

Next Story