ఐసీఐసీఐ మాజీ సీఎండీ చందాకొచ్చర్ భర్త అరెస్ట్..!

By సుభాష్  Published on  8 Sep 2020 4:46 AM GMT
ఐసీఐసీఐ మాజీ సీఎండీ చందాకొచ్చర్ భర్త అరెస్ట్..!

ఐసీఐసీఐ మాజీ సీఎండీ చందాకొచ్చర్ భర్త, వ్యాపారవేత్త దీపక్ కొచ్చర్ ‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐసీఐసీఐ-వీడియోకాన్‌ రుణాల కుంభకోణం కేసులో దీపక్ ను అరెస్టు చేయడం సంచలనం అయింది. ఐసీఐసీఐ మాజీ సీఎండీ చందాకొచ్చర్ ‌ను కూడా ఈ కేసులో కీలక నిందితురాలిగా పేర్కొన్నారు. 3,250 కోట్ల రూపాయల కుంభకోణంలో క్విడ్ ప్రో కో కింద అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకుని.. ఎందరికో రోల్ మోడల్ గా నిలిచిన చందా కొచ్చర్ తన పదవిని కోల్పోయారు.

జనవరి 22, 2019 న సీబీఐ మోసం, నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్, అతని కంపెనీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. జనవరి 31న, ఐసీఐసీఐ బ్యాంక్ కార్పొరేట్ గ్రూపు 1,875 కోట్ల రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలు పాల్పడ్డాయని ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయ్యింది. ఓ వైపు మనీలాండరింగ్ కేసులో గత ఏడాది మార్చిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకున్న ఆస్తులను విడుదల చేయాలని కోరుతూ దీపక్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆస్తుల సీజ్ ఒక సంవత్సరం మాత్రమే ఉంటుందని, ఈడీ ఎలాంటి చార్జ్ షీట్ దాఖలు చేయని కారణంగా సంస్థ ఆస్తులను విడుదల చేయాలని దీపక్ కొచర్‌కు చెందిన పసిఫిక్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కోరింది. ఇలాంటి పిటిషన్ ఇప్పటికే బొంబాయి హైకోర్టులో పెండింగ్‌లో ఉందని ఈడీ వాదించింది. ఇలాంటి సమయంలో దీపక్ కొచ్చర్ ను అరెస్టు చేయడం సంచలనానికి దారి తీసింది. మంగళవారం నాడు దీపక్ కొచ్చర్ ను సెషన్స్ కోర్టులో హాజరుపరచనున్నారు.

Next Story