సుప్రీం ను ఆశ్రయించిన కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు

By రాణి  Published on  5 Feb 2020 1:27 PM GMT
సుప్రీం ను ఆశ్రయించిన కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు

నిర్భయ దోషుల ఉరిపై ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ..కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. నిర్భయ కేసులో దోషులను ఒకేసారి ఉరితీయాలని, వేర్వేరుగా ఉరి తీయడం కుదరదని, నిర్భయ నిందితుల డెత్ వారెంట్ పై పటియాలా కోర్టు ఇచ్చిన స్టే యథాతథంగా కొనసాగుతుందని ఢిల్లీ హై కోర్టు చెప్పిన సంగతి తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశాయి.

నిర్భయ కేసు నిందితుల ఉరి పై ఢిల్లీ పటియాలా కోర్టు స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు అక్కడి హై కోర్టులో వేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. నలుగురు నిందితులను వేర్వేరుగా ఉరి తీయడం కుదరని తేల్చి చెప్పింది. నిందితులు పెట్టుకున్న అర్జీలు అన్నీ క్లియర్ చేసేందుకు, దోషులకు ఉన్న అన్ని న్యాయపరమైన హక్కులు వినియోగించుకునేందుకు కోర్టు వారంరోజులు గడువిచ్చింది. ఈ వారంరోజులు గడువు ముగిసిన తర్వాత నిందితుల ఉరికి సంబంధించిన విచారణ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఢిల్లి హై కోర్టు తెలిపింది.

కాగా..ఫిబ్రవరి 1వ తేదీనే నలుగురిని ఉరి తీయాల్సి ఉండగా..ఢిల్లి పటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ పై స్టే ఇచ్చింది. దీనిపై శని, ఆదివారాలు విచారణ చేసిన కోర్టు తీర్పును రిజర్వ్ లో పెట్టింది. ప్రస్తుతం దోషుల్లో అక్షయ్ కుమార్ ఒక్కడే రాష్ర్టపతికి క్షమాభిక్ష పెట్టుకున్నాడు. ఇది ఒక్కటి పెండింగ్ లో ఉంది. ఇప్పటికి రెండు సార్లు నిందితుల ఉరిశిక్ష పై స్టే విధించడం పట్ల దేశ వ్యాప్తంగా ఆరోపణలు వస్తున్నాయి.

Next Story
Share it