తవ్వేకొద్దీ బయటపడుతున్న రాయపాటి స్కామ్ లు

By రాణి  Published on  31 Dec 2019 12:08 PM GMT
తవ్వేకొద్దీ బయటపడుతున్న రాయపాటి స్కామ్ లు

ముఖ్యాంశాలు

  • ట్రాన్స్ ట్రాయ్ వేల కోట్ల రూపాయల స్కామ్
  • ఎఫ్.ఐ.ఆర్ రిజిస్టర్ చేసిన సి.బి.ఐ
  • మోసపూరిత కుట్ర అభియోగం నమోదు
  • భారీస్థాయిలో నిధుల దుర్వినియోగం
  • అకౌంట్ పుస్తకాల్లో భారీ స్థాయి అవకతవకలు
  • జరిగిన మోసాన్ని గుర్తించిన కెనరా బ్యాంక్
  • ప్రత్యేక ఆడిట్ లో బయటపడ్డ వాస్తవాలు

హైదరాబాద్ : తెలుగు దేశం పార్టీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ వివిధ బ్యాంకులనుంచి అప్పు తీసుకున్న కోట్లాది రూపాయల్ని దారి మళ్లించడమేకాక, పెద్దఎత్తున విరాళాలకుకూడా ఖర్చుపెట్టిందని సిబిఐ విచారణలో తేలింది. కోట్లాది రూపాయల నగదును సింగపూర్ కి, ఇతర దేశాలకూ మళ్లించడమేకాక, 2012లో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన తిరుచానూరులోని పద్మావతీ అమ్మవారి ఆలయానికి పెద్ద ఎత్తున విరాళమిచ్చేందుకు ఖర్చుపెట్టినట్టుగా తెలుస్తోంది. 2012లో రాయపాటి సాంబశివరావు తన కుటుంబంతో కలసి తిరుపతి - తిరుచానూరులోని పద్మావతీ అమ్మవారికి ఆలయం చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో వజ్రాలు తాపడం చేసిన అత్యంత ఖరీదైన చీరను సమర్పించారు. దీనికి సంబంధించిన ఖర్చంతా పూర్తిగా ట్రాన్స్ స్ట్రోయ్ కంపెనీయే భరించినట్టుగా తెలుస్తోంది.

ట్రాన్స్ ట్రాయ్ నుంచి రూ.15.34 కోట్ల రూపాయల్ని 2013 - 14లో సింగపూర్ లోని పి.టి.ఇ లిమిటెడ్ కంపెనీకి అనుమతి లేకుండా మళ్లించినట్టుగా గుర్తించారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో మరో రూ.5.28 కోట్ల రూపాయల్ని బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేసేందుకు వినియోగించినట్టుగా తెలుస్తోంది. నిబంధనల ప్రకారం బ్యాంకుల దగ్గరినుంచి అప్పు తీసుకున్న నిధులను కేవలం ఉద్దేశించిన వ్యాపారానికి మాత్రమే ఖర్చుపెట్టాలి. కంపెనీ డైరెక్టర్లుకూడా భారీ అవకతవకలకు పాల్పడినట్టుగా సిబిఐ విచారణలో తేలినట్టు సమాచారం. సదరు అవతకవకల్ని సరిదిద్దేందుకు అకౌంట్ పుస్తకాల్లో లెక్కల్నికూడా మార్చినట్టు కనిపిస్తోందని అధికారులు అంటున్నారు. మొదట్లో రూ.2,341 కోట్ల రూపాయలను కుమార్ అండ్ కంపెనీకి తరలించినట్టుగా అనుకున్నారు. కానీ తర్వాత లెడ్జర్ వివరాలను బట్టి చూస్తే జయలక్ష్మీ పవర్ కార్పొరేషన్ పేరుతో ఉన్న ఓ కంపెనీని కొనేందుకు రూ36 కోట్ల రూపాయల్ని బ్యాంకుల అనుమతి లేకుండా ఖర్చుచేసినట్టు తెలుస్తోంది.

ఇష్టారాజ్యంగా డైరెక్టర్ల అవకతవకలు

కంపెనీ డైరెక్టర్లు వివిధ మార్గాల్లో కంపెనీనుంచి రూ.3,822 కోట్ల రూపాయలను దారి మళ్లించి అందులో రూ. 794 కోట్ల రూపాయల్ని రిజర్వ్స్ అండ్ సర్ ప్లస్ హెడ్స్ కింద అడ్జస్ట్ చేశారని విజిలెన్స్ ఆడిట్ లో తేలినట్టుగా అధికారులు చెబుతున్నారు. అలాగే స్టాక్ స్టేట్మెంట్లని మానిప్యులేట్ చేశారనీ, రూ. 2,298 కోట్ల మేరకు లెక్కల్లో తేడా వచ్చిందనీ వివరాలు తెలియవచ్చాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిబిఐ ట్రాన్స్ ట్రాయ్ కంపెనీపై కుట్రపూరితమైన మోసం కేసు పెట్టింది. సిబిఐ బ్యాంకింగ్ సెక్యూరిటీస్ మరియు మోసాల సెల్ అధికారులు ఈ కేసుకు సంబంధించి కంపెనీ డైరెక్టర్లు రూ.264 కోట్లకు పైగా వడ్డీ మొత్తాన్నికూడా దారి మళ్లించినట్టు విచారణలో తెలుసుకున్నారు.

మొదట చిన్నగానే కనిపించిన ఈ కేసును తవ్వినకొద్దీ వివరాలు బయటపడుతూనే ఉన్నట్టుగా సమాచారం. భారీ స్థాయిలో అవకతవకలు జరిగిట్టుగా అధికారులు గుర్తించిన తర్వాత ఇది వేల కోట్ల రూపాయల స్కామ్ గా నిర్ధారణ అయ్యింది. ట్రాన్స్ స్ట్రోయ్ లెక్కలేని విధంగా వివిధ బ్యాంకులనుంచి విచ్చలవిడిగా ఋణాలు తీసుకుని పరిమితులను మించి క్రెడిట్ లిమిట్స్ ని అధిగమించడంలో పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించారని ఈ కేసును విచారిస్తున్న అధికారులు చెబుతున్నారు. మొదట రూ.50 కోట్లుగా ఉన్న క్రెడిట్ లిమిట్ ను రూ. 81 కోట్లకు పెంచడం జరిగింది. తర్వాత లెటర్ ఆఫ్ గ్యారంటీ ద్వారా రూ.100 నుంచి రూ. 234 కోట్లకు, లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా రూ.35 కోట్లనుంచి రూ.50 కోట్లకు కంపెనీ క్రెడిట్ లిమిట్స్ ని ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ పోయినట్టు తెలుస్తోంది.

ఆగస్ట్ 2013లో కెనరాబ్యాంక్ కంపెనీ లోన్ అకౌంట్ ని ఎన్.పి.ఎగా గుర్తించాల్సిన పరిస్థితి తలెత్తింది. 2015లో అకౌంట్ స్థాయిని తగ్గించి సబ్ స్టాండర్డ్ కేటగిరీలో చేర్చారు. నిరంతరాయంగా అవకతవకలు జరగడం, తరచూ లెటర్ ఆఫ్ క్రెడిట్ లు సమర్పించడం, కనీసం వర్కింగ్ క్యాపిటల్ లిమిట్ మీద వడ్డీకూడా చెల్లించకపోవడం లాంటి కారణాల వల్ల బ్యాంక్ అధికారులు కంపెనీ అకౌంట్ ను డీ గ్రేడ్ చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఇవే కారణాల వల్ల కెనరా బ్యాంక్ ఇ అండ్ వై 2017లో కంపెనీ ప్రత్యేక ఆడిట్ ని నిర్వహించింది. ఈ ఆడిట్ లో కంపెనీ రూ.794 కోట్లను రిజర్వ్స్ అండ్ సర్ ప్లస్ గా రైటాఫ్ చేసినట్టుగా గుర్తించారు. అదే విధంగా బ్యాంకుల హైపోథికేషన్లను తుంగలో తొక్కి రూ.2,261 కోట్ల సన్ డ్రీ డెట్టార్లను కూడా రైటాఫ్ చేసినట్టుగా తెలుస్తోంది. 2018లో ఈ కంపెనీ అకౌంట్ ని బ్యాంక్ మోసంగా గుర్తించి ప్రకటించింది. సిబిఐ దాఖలు చేసిన ఎఫ్.ఐ.ఆర్ లో కంపెనీ ప్రమోటర్ చైర్మన్ రాయపాటి సాంబశివరావు, ఎం.డి చెరుకూరి శ్రీధర్, ఇండిపెండెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూర్యదేవర శ్రీనివాస బాబ్జిలతోపాటుగా మరికొందరు బ్యాంక్ అధికారుల మీద కూడా అభియోగాలు మోపినట్టుగా తెలుస్తోంది.

Next Story
Share it