పెళ్లి పేరుతో ఒడియా తార అందమైన వల..!

By Newsmeter.Network  Published on  30 Dec 2019 6:18 AM GMT
పెళ్లి పేరుతో ఒడియా తార అందమైన వల..!

ముఖ్యాంశాలు

  • పెళ్లి పేరుతో కుర్రాళ్లను దోచుకుంటున్న ఒడియాతార
  • వెలుగులోకి వస్తున్న చిన్మయి ప్రియదర్శిని మోసాలు
  • చిన్మయిపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
  • చర్యలు తీసుకుంటామంటున్న ఒడిషా పోలీసులు

భువనేశ్వర్ : అందాన్ని ఎరగా వేసి పెళ్లి పేరుతో కుర్రాళ్లను దోచుకుంటున్న ఒడియా తార చిన్మయి ప్రియదర్శిని మోసాలు ఒక్కొటొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. విశాఖ కుర్రాడు నాయక్ ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఒక్కొక్కరుగా చిన్మయి బాధితులు వెలుగులోకి వస్తున్నారు.

విశాఖపట్నానికి చెందిన నాయక్ అనే యువకుడు ఒడియా తార చిన్మయి ప్రియదర్శిని పెళ్లి పేరుతో తనను మోసం చేసిందని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయం వార్తల్లోకి ఎక్కేసరికి మరికొందరు కుర్రాళ్లుకూడా తమను కూడా ఆ తార అలాగే మోసం చేసిందంటూ ఫిర్యాదు చేస్తున్నారు.

ఓ మ్యాట్రిమోనియల్ సైట్ల్ లో చూసి పెళ్లి ప్రపోజల్ పెట్టిన నాయక్ చిన్మయి మాటలో పడిపోయాడు. తన దగ్గర చిన్మయి అనేక సందర్భాల్లో లక్షలాది రూపాయలు తీసుకుందనీ, అలాగే ఒక ల్యాప్ టాప్, ఒక బంగారు గొలుసుకూడా తీసుకుందని ఆ కుర్రాడు ఫిర్యాదు చేశాడు.

తననుకూడా పెళ్లి చేసుకుంటానని చెప్పి చిన్మయి రెండున్నర లక్షల రూపాయలు వసూలు చేసిందని మరో కుర్రాడుకూడా విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తర్వాత అసలు నిజం తెలుసుకుని తన డబ్బులు తనకు ఇచ్చేయమని ఆ కుర్రాడు ఒత్తిడి చేశాడు.

తనకు చాలామంది పెద్దవాళ్లు తెలుసని, తన పరిచయాల్ని ఉపయోగించుకుని అంతుచూస్తానని చిన్మయి తనను బెదిరించిందనీ ఆ కుర్రాడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనని చిన్మయి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి డబ్బు తీసుకుందని, ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ సదరు కుర్రాడు కోర్టులో ప్రైవేట్ కేసుకూడా వేశాడు.

బెర్హమ్ పూర్ కి చెందిన జగన్నాథ్ సేథీదికూడా అదే పరిస్థితి. ఓ సినిమాలో వేషం ఇప్పిస్తానని చెప్పి స్క్రీన్ టెస్ట్ కోసం ఏర్పాటు చేస్తానని చెప్పి చిన్మయి తన దగ్గర తొమ్మిది వేల రూపాయలు తీసుకుందని జగన్నాథ్ చెబుతున్నాడు. సినిమా ఛాన్స్ విషయం తేలకపోయేసరికి తన డబ్బు తనకు తిరిగి ఇవ్వమని అడిగితే ఫేస్ బుక్ ప్రొఫైల్ ని బ్లాక్ చేసిందట.

డిసెంబర్ 23న ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నానికి చెందిన పద్మరాజు రవికుమార్ అనే కుర్రాడు చిన్మయి చేసిన మోసం గురించి ఒడిషా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ మ్యాట్రిమోనీ సైట్ లో తనకు పరిచయం అయిన చిన్మయి పెళ్లి చేసుకుందామంటూ నమ్మించిందనీ, తర్వాత విడతలుగా తన దగ్గర చాలా డబ్బు తీసుకుందని, పెళ్లి గురించి అడిగితే మొహం చాటేస్తోందనీ తన ఫిర్యాదులో జరిగిన కథంతా మొత్తం వివరంగా రాశాడు.

చిన్మయి మీద వస్తున్న ఫిర్యాదుల్ని స్వీకరించి చట్ట ప్రకారం తప్పకుండా చర్యలు తీసుకుంటామని భువనేశ్వర్ డిసిపి అనూప్ కుమార్ చెబుతున్నారు. చట్టానికి ఎవరూ చుట్టాలు కారనీ, ఎవరైనా సరే మోసం చేస్తే దానికి తగిన శిక్షను అనుభవించక తప్పదని ఆయన అంటున్నారు.

Next Story