ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఆస్తుల కేసు పిటిషన్‌పై ఈ రోజు సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో ఉన్న ఏ1 నిందితుడుగా జగన్‌ తప్పకుండా హాజరు కావాలని గత విచారణలో సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఏపీలో అత్యవసర సమీక్ష సమావేశం ఉన్నందున కోర్టుకు హాజరు కాలేకపోతున్నానని, మినహాయింపు ఇవ్వాలని జగన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా, హైకోర్టులో కేసు కొనసాగుతోందని న్యాయవాదులు సీబీఐ కోర్టుకు తెలియజేయనున్నారు. దీంతో హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసేందుకు సీబీఐ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

కాగా, జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలనాపరమైన అంశాలలో బిజీ అయ్యారు. దీంతో కోర్టుకు హాజరు కాలేకపోతున్నారు. ఈ విషయాన్ని జగన్‌ ముందుగా కోర్టుకు నివేదించారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అనుమతి తీసుకుంటూ వస్తున్నారు. కానీ జగన్‌ కోర్టుకు వరుసగా హాజరు కాకపోవడంతో కేసు విచారణపై ప్రభావం ఏర్పడుతుందని సీబీఐ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐ వాదనలపై స్పందించిన కోర్టు.. జగన్‌ కోర్టు హాజరుపై ప్రతిసారి మినహాయింపు ఇవ్వలేమని, ఇవ్వడం కూడా కుదరదని తేల్చి చెప్పింది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.