గోదావరి తీరంలో కుల బహిష్కరణ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Sep 2019 2:11 PM GMT
గోదావరి తీరంలో కుల బహిష్కరణ..!

రావులపాలెం, తూ.గో. జిల్లా: టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో కూడా కొంత మందికి కుల బహిష్కరణ తప్పడంలేదు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం కొమర్రాజులంక గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. కుల బహిష్కరణతో ఏడాది నుంచి నరకయాతన అనుభవిస్తున్నారు . తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యామని చెప్పారు. . గ్రామ పెద్దల్లో మార్పు రాకపోవడంతో యామన వెంకట లక్ష్మి, యామన దుర్గాభవానీలు స్పందన కార్యక్రమంలో పోలీస్‌, రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు.

యామన వెంకటలక్ష్మి, యామని దుర్గాభవానీలు తోడి కోడళ్లు. వీరి కుటుంబ సభ్యులకు కొమర్రాజులంక గ్రామంలో తాతల కాలం నుంచి సంక్రమించిన ఇంటి స్థలం ఉంది. గతంలో తమ భూమిలోని మూడు అడుగుల భూమిని ..తమ కులానికే చెందిన ఒక వ్యక్తి ఆక్రమించుకున్నారని తెలిపారు. అంతేకాకుండా .. కొన్నాళ్ల తర్వాత మరొక అడుగు భూమిని ఇవ్వాలని హుకుం జారీ చేశారని చెప్పారు. దీనికి తమ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదన్నారు. దీంతో తమ రెండు కుటుంబాలను ఏడాది కాలం నుంచి కుల బహిష్కరణ చేశారని తోడి కోడళ్లు ఇద్దరూ ఆవేదన వ్యక్తం చేశారు.

సంఘం పెద్దలు తమకు గ్రామంలో ఎలాంటి సహాయ, సహకారాలు అందజేయొద్దని హుకుం జారీ చేశారన్నారు. బహిష్కరణ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా వేస్తామని హెచ్చరించారన్నారు లక్ష్మీ, దుర్గా భవానీలు. గ్రామంలోని తమ కులస్తులు ఎవరు మాట్లాడడం లేదని,ఎటువంటి శుభకార్యాలకు పిలవడం లేదని వాపోయారు. తాము ఇల్లు నిర్మించుకుంటే ఇంటి నిర్మాణ పనుల్లోకి వచ్చిన ఐరన్, తాపీ కార్మికులను భయపెట్టి..వెల్లగొట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంటి నిర్మాణం కోసం తెచ్చిన కంకర, ఇసుక, ఐరన్ వంటి వాటిని కాజేశారని వాపోయారు. కుల బహిష్కరణ కారణంగా 25 సంవత్సరాలుగా ఉంటున్న డ్వాక్రా సంఘం నుంచి కూడా తీసివేశారన్నారు.

తమ ఇద్దరిలో ఒకరు డ్వాక్రా సంఘం లో సెక్రటరీగా ఉన్నామన్నారు. అయినప్పటికీ..తమకు తెలియకుండా సభ్యులు డ్వాక్రా రుణాలు పొందుతున్నారని వాపోయారు.

తమనే కాకుండా తమ పిల్లల్ని కూడా కుల బహిష్కరణ చేశారని లక్ష్మీ , భవానీలు వాపోతున్నారు. పిల్లలను హేళన చేస్తుంటే గుండె తరుక్కుపోతుందన్నారు. చివరకు ఆలయానికి వెళ్లినా ప్రసాదం పెట్టడంలేదని ..పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మొదట తమతో మాట్లాడితే రూ.200 జరిమానా అన్నారని..ఇంటికి బంధువులు వస్తే రూ.5వేలు వేశారని ఫిర్యాదులో రాశారు. తీసుకెళ్లిన కంకర, ఇసుక, ఐరన్‌ గురించి అడిగితే అప్పటికప్పుడు మీటింగ్‌లు పెట్టుకుని మరింత వేధించారన్నారు. అంతేకాదు..రూ.50వేల జరిమానా అంటూ బెదరించారని తెలిపారు. కుల బహిష్కరణతో ఆర్ధికంగా, మానసికంగా కుంగిపోయామని రావులపాలెం పీఎస్‌లో తోడికోడళ్లు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులకు లక్ష్మీ, భవానీలు విజ్ఞప్తి చేశారు

Next Story