బుల్లితెర రాములమ్మపై బంజారహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
By తోట వంశీ కుమార్ Published on 5 May 2020 6:40 PM IST
ప్రముఖ బుల్లితెర యాంకర్, బిగ్‌బాస్ సీజన్-3 రన్నరప్ శ్రీముఖిపై బంజారహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఓ ఛానల్‌లో శ్రీముఖి బ్రాహ్మణులను కించపరిచినట్లు వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయం తెలిసిన ఆమె ఫ్యాన్స్ షాక్‌కు గురైయ్యారు.
ఓ ప్రముఖ టీవీ ఛానెల్లో జరిగే ఓ కామెడి కార్యక్రమంలో శ్రీముఖి బ్రాహ్మణులను అవమాన పరిచిందని నల్లకుంటకు చెందిన శర్మ అనే వ్యక్తి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కార్యక్రమ వీడియోలను కూడా చూపించాడు. బ్రాహ్మణులను కించపరిచే విధంగా కామెడీ షోలో దృశ్యాలను చిత్రీకరించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో.. ఆ ఛానల్ తో పాటు యాంకర్ శ్రీముఖిపై కేసు నమోదైంది. దీనిపై సదరు ఛానల్‌తో పాటు శ్రీముఖి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
బుల్లితెర లీడింగ్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఓ పక్క యాంకరింగ్ చేస్తూనే.. వెండితెరపై పలు చిత్రాల్లో కనిపించింది. అందంతో పాటు అభినయం ఆమె సొంతం. తెలుగు బిగ్‌బాస్ సీజన్-3 లో ఆమె పాల్గొని రన్నరప్ గా నిలిచింది.