గాలిపై కేసు పెట్టాలి.. అన్నాడీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Oct 2019 1:44 PM GMT
గాలిపై కేసు పెట్టాలి.. అన్నాడీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు

చెన్నై: హోర్డింగ్ మీదపడి యువతి మరణించిన కేసుపై అన్నా డీఎంకే సీనియర్ నేత పొన్నయన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరణానికి కారణం హోర్డింగ్ కాదని, గాలి వీచడం వల్లే హోర్డింగ్ పడిపోయిందన్నారు. కాబట్టి ..గాలి పైనే కేసు పెట్టాలన్నారు పొన్నయన్. గతవారం శుభ శ్రీ అనే యువతి మృతి చెందిన ఈ ఘటనలో జయ గోపాల్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జయగోపాలే హోర్డింగ్ పెట్టారని పోలీసులు నిర్ధారించారు. తమ ఇంటిలోని వివాహానికి డిప్యూటీ సీఎంను ఆహ్వానిస్తూ ఆయన హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. ఆఫీస్ నుంచి టు వీలర్ బైక్ పై ఇంటికి వెళుతున్న శుభశ్రీ హోర్డింగ్ దగ్గరకు వచ్చేసరికి గాలి బాగా వీచింది. దీంతో...హోర్డింగ్ శుభ శ్రీపై పడింది. దురదృష్టవశాత్తూ..వెనుక నుంచి లారీ శుభ శ్రీని ఢీ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

ఈ సంఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీనిపై మద్రాసు హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తమిళనాడులో హోర్డింగ్‌లకు స్వస్తి చెప్పాలని అధికార, ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. ఈ ఘటనపై నటుడు, ఎంఎన్ఎం వ్యవస్థాపకుడు కమల్ హాసన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉదాసీన వైఖరి, పరిణితి లేని నాయకుల వలనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ఈ సంఘటనపై పలువురు తమిళ అగ్రహీరోలు కూడా స్పందించారు. కొత్త చిత్రం విడుదలైతే ఇబ్బడి ముబ్బడిగా కటౌట్లు పెట్టొదని విజయ్, సూర్య అభిమానులను కోరారు.

Next Story
Share it