ఇక చిన్న రక్త పరీక్షతో క్యాన్సర్ వ్యాధి గుర్తింపు

ఒక చిన్న రక్త పరీక్ష చేస్తే చాలు.. క్యాన్సర్ వ్యాధిని గుర్తించవచ్చు. అవును. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ద్రువీకరిస్తున్నారు. భారత, అమెరికన్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించిన పరీక్షల్లో భాగంగా మన దేశంలోని ప్రధాన నగరాల్లోని 16134 మంది రోగులను పరీక్షించగా, ఒక వినూత్న పరీక్ష ద్వారా రక్తంలో కాన్సర్ కణాలను గుర్తించవచ్చునని తేలింది. ఈ పరిశోధనల వివరాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్ అనే శాస్త్రీయ ప్రచురణ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనలు క్యాన్సర్ ను గుర్తించే ప్రక్రియను సరళం, వేగవంతం, సమర్థవంతంగా మార్చగలుగుతాయి. ఈ పరీక్షా విధానాలను త్వరలోనే మార్కెట్ లోకి అందుబాటులోకి తేనున్నారు.

ఈ విషయాన్ని దాతార్ క్యాన్సర్ జెనెటిక్స్ సంస్థకు చెందిన డా. వినీత్ దత్త ఈ మధ్యే హైదరాబాద్ కి వచ్చినప్పుడు తెలియచేశారు. ఈ అధ్యయనం వల్ల చిన్న పాటి రక్త పరీక్షతోనే క్యాన్సర్ ను గుర్తించవచ్చునని ఆయన తెలిపారు. క్యాన్సర్ ఏర్పడినప్పుడు గడ్డలా తయారవుతుంది. దాని నుంచి కొన్ని కణాలు వేరు పడి రక్తంలోకి వచ్చేస్తాయి. ఇలా రక్త ప్రవాహంలో కలిసి అవి ప్రయాణిస్తూ ఉంటాయి. ఒక పది మిల్లీ లీటర్ల రక్తం నమూనాను సేకరిస్తే దానిలో దాదాపు పది మిలియన్ల రక్త కణాలుంటాయి. వీటి నుంచి క్యాన్సర్ కణాలను గుర్తించి వ్యాధిని నిర్ధారించడానికి వీలు పడుతుంది.

డా. దత్తా, యూకే లోని రాయల్ సర్రే కౌంటీ ఆస్పత్రిలోని సెయింట్ ల్యూక్స్ క్యాన్సర్ సెంటర్ కి చెందిన డా. టిమ్ క్రూక్ లు ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన ఒక క్యాన్సర్ కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా న్యూస్ మీటర్ తో సంభాషించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కొత్తగా కనుగొన్న వైద్య పరీక్ష చాలా సులువుగా, రోగికి ఎలాంటి కష్టమూ కలగకుండా చేయడానికి వీలవుతుందని, ఆరోగ్యంగా కనిపిస్తూనే శరీరంలో క్యాన్సర్ ఉన్న వారిని గుర్తించడం సాధ్యపడుతుందని అన్నారు. ఈ పద్ధతిని పాటిస్తే ఇక చాలా కష్టసాధ్యమైన, ఇబ్బందులతో కూడుకున్న బయాప్సీని చేయాల్సిన అవసరం ఉండదని వారంటున్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.