26 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ: మంత్రి నాని

By సుభాష్  Published on  4 March 2020 3:50 PM GMT
26 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ: మంత్రి నాని

ఉగాది పండగ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. అందుకు మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఏపీ మంత్రివర్గ సమావేశం అనంతరం నాని మీడియాతో మాట్లాడారు.

స్థలం పొందిన లబ్ధిదారులు ఇళ్ల నిర్మించుకోవాడనికి అనుమతి పత్రంతో పాటు ఐదేళ్ల వరకు స్థలం బ్యాంకులో తనఖా పెట్టుకోవడానికి ఐదేళ్ల తర్వాత విక్రయానికి హక్కు కల్పిస్తూ పట్టా ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేసేందుకు 43,141 ఎకరాల భూమిని సిద్ధం చేశామని, ఇందులో 26,976 ఎకరాల ప్రభుత్వ భూమి, 16,164 ప్రైవేటు భూమి ఉందన్నారు. యుద్ధ ప్రాతిపదికన ప్లాట్లు అభివృద్ధి చేసి లబ్ధిదారులకు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ కాలనీలన్నింటికి వైఎస్సార్‌ జగనన్న కాలనీలుగా నామకరణం చేస్తామన్నారు. ఎన్‌పీఆర్‌కు సంబంధించిన మైనార్టీలకు భరోసా ఇచ్చి తీర్మానం చేశామన్నారు.

పోర్టుల నిర్మాణానికి ఏర్పాట్లతో పాటు అడ్డంకులు తొలగించేలా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అలాగే రూ.500 కోట్ల రుణం తెచ్చుకునేందుకు సీడ్‌ కార్పొరేషన్‌కు కేబినెట్‌ అనుమతి ఇచ్చిందన్నారు. ఒంగోలులో టీడీపీకి కేటాయించిన రెండెకరాల భూమిని రద్దు చేస్తూ మంత్రివర్గంలో తీర్మానం చేసినట్లు చెప్పారు. ఆ భూమిని తిరిగి జలవనరుల శాఖకు అప్పగించేలా నిర్ణయం తీసుకున్నామని మంత్రి నాని చెప్పారు. అలాగే భోగాపురం విమానాశ్రయం పనుల్లో జీఎంఆర్‌కు అనుమతిస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Next Story