ఆర్టీసీ బస్సు బంద్‌.. బెంగపెట్టుకున్న హాజీపూర్‌ గ్రామస్తులు..!

By Newsmeter.Network  Published on  5 Jan 2020 4:41 AM GMT
ఆర్టీసీ బస్సు బంద్‌.. బెంగపెట్టుకున్న హాజీపూర్‌ గ్రామస్తులు..!

యాదాద్రి భువనగిరి: హాజీపూర్‌ విద్యార్థుల కోసం గత 8 నెలల నుంచి నడుస్తున్న ఆర్టీసీ బస్సును అధికారులు రద్దు చేశారు. దీంతో మహిళలు, విద్యార్థినిలు భయాందోళనకు గురవుతున్నారు. అసలే నిర్జన ప్రదేశం.. ఎట్నుంచి ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియక ఆ గ్రామ ప్రజలు బెంగపెట్టుకున్నారు. తమ అమ్మాయిలు ఎలా చదువుకోవాలంటూ తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు.

గత సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో యాదాద్రిలోని హాజీపూర్‌లో సీరియల్‌ మర్డర్స్‌ సంచలనం సృష్టించాయి. శ్రీనివాసరెడ్డి అనే మానవమృగం ముగ్గురు విద్యార్థులను అత్యాచారం చేసి అతికిరాతంగా అత్య చేశాడు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ఏం చేస్తున్నారన్నదానిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే హాజీపూర్‌ గ్రామానికి అప్పటివరకు కనీసం బస్సు సౌకర్యం కూడా లేదు. ఒక వేళ బస్సు సౌకర్యం ఉంటే మానవమృగానికి ముగ్గురు విద్యార్థినిల ప్రాణాలు బలి కాకుండా ఉండేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యం కల్పించారు. రాజకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ విజ్ఞప్తి మేరకు హాజీపూర్‌కు అధికారులు బస్సును ఏర్పాటు చేశారు.

ఉన్న పళంగా బస్సును రద్దు చేయడంతో విద్యార్థులు, మహిళలు నానా ఇబ్బందులు పడుతున్నారు. బడికి, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు కాలినడకన బొమ్మల రామారం చేరుకొని అక్కడి నుంచి ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె తర్వాత అధికారులు హాజీపూర్‌కు వెళ్లే బస్సును రద్దు చేశారు. సంస్థ నష్ట నివారణ చర్యల్లో భాగంగా హాజీపూర్‌ బస్సు సర్వీసును రద్దు చేయాలని అధికారుల నిర్ణయించారు. దీంతో ఈసీఐఎల్‌ డిపో మేనేజర్‌ ఎదుట గ్రామస్తులు ఆందోళన చేశారు. నష్టాలు వచ్చిన తమ ఊరికి బస్సు నడపాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు యాదగిరిగుట్ట డిపో, కుషాయిగూడ డిపో అధికారులకు వినతిపత్రాలు అందించారు. హాజీపూర్‌ ఘటన నేపథ్యంలో బస్సు సౌకర్యం కల్పించామని భువనగిరి కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ తెలిపారు. ఒక రోజు బస్సు నడవలేదని తెలిసిందని, దీనిపై అధికారులతో మాట్లాడుతానన్నారు. బస్సును యాధావిధిగా నడిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు.

Next Story