కేంద్ర బడ్జెట్: 50కి పైగా వస్తువులపై బాదుడు..?
By సుభాష్ Published on 29 Jan 2020 7:24 PM ISTకేంద్ర సర్కార్ ఈసారి బడ్జెట్‌తో ప్రజలకు షాకివ్వనున్నట్లు తెలుస్తోంది. వెలువడుతున్ననివేదిక ప్రకారం చూస్తే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. మోదీ సర్కార్ బడ్జెట్ 2020లో ఏకంగా 50కిపైగా వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో దిగుమతి సుంకాల పెంపునకు సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొబైల్ చార్జర్లు, ఇండస్ట్రియల్ కెమికల్స్, ల్యాంప్స్, ఫర్నచర్స్, జువెలరీ, హ్యాండిక్రాప్ట్స్ సహా దాదాపు 50కిపైగా ప్రొడక్టులపై దిగుమతి సుంకాలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
దిగుమతి సుంకాల పెంపు 5 నుంచి 10 శాతం వరకు..
కేంద్ర సర్కార్ ఇప్పటికే ఏఏ వస్తువులపై దిగుమతి సుంకాలు పెంచాలో ఒక నిర్ణయానికి వచ్చిందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. దిగుమతి సుంకాల పెంపు 5 నుంచి 10 శాతం వరకు పేర్కొంటున్నారు. అత్యవసరం కాని వస్తువులను దిగుమతులను తగ్గించడమే లక్ష్యమని చెబుతున్నారు. ఇక దిగుమతి సుంకాల పెంపు వల్ల దేశీ పరిశ్రమలకు ఊరట కలిగించాలని మోదీ సర్కార్ భావిస్తోంది.
మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో వచ్చినప్పటి నుంచి దిగుమతులపై పలు నియంత్రణలు తీసుకువచ్చారు. దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్ సహా ఇతర రంగాల్లో విదేశీ ఇన్వెస్ట్ మెంట్లు పెంచడమే అసలు లక్ష్యం. వాణిజ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఒక కమిటీ 130 వస్తువులపై సుంకాలు పెంచాలని సిఫార్సు చేసింది. కాగా, ఇప్పుడు వీటి సంఖ్య 50కి తగ్గింది.