కోలుకుంటున్న బ్రిటన్‌ ప్రధాని.. ఐసీయూ నుంచి వార్డుకు

By Newsmeter.Network  Published on  10 April 2020 6:42 AM GMT
కోలుకుంటున్న బ్రిటన్‌ ప్రధాని.. ఐసీయూ నుంచి వార్డుకు

కరోనా వైరస్‌ మహమ్మారితో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈవైరస్‌ భారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలు దేశాలకు చెందిన అధ్యక్షులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వైరస్‌ భారిన పడి చికిత్సలు పొందుతున్నారు. బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌కి సైతం కరోనా వైరస్‌ సోకింది. దీంతో తొలుత ఇంటి వద్దనే క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందిన ప్రధాని.. గత మూడు రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో హుటాహుటీన వైద్యులు బోరిస్‌ను ఆస్పత్రికి తరలించారు. లండన్‌ ఆస్పత్రిలోని ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. దీంతో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తమైంది. భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఇతర దేశాధినేతలు బోరిస్‌ త్వరగా కోలుకోవాలని కోరుతూ ట్వీటర్‌ ద్వారా తమ సందేశాన్ని పంపించారు.

Also Read :కరోనాకు లొంగని 101ఏళ్ల వృద్ధుడు.. క్షేమంగా ఇంటికి..

కాగా గురువారం సాయంత్రం వరకు జాన్సన్‌ ఆరోగ్యం కొంత మెరుగుపడటంతో అక్కడి వైద్యులు ఆయన్ను ఇంటెన్సివ్‌ కేర్‌ నుంచి వార్డుకు మార్చారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా త్వరలోనే బోరిస్‌ జాన్సన్‌ పూర్తిస్థాయిలో కోలుకుంటారని అక్కడి వైద్యులు తెలిపారు. అయితే.. ప్రధాని మళ్లి ఎప్పుడు పూర్తిస్థాయిలో విధులకు హాజరవుతారన్నది తెలియాల్సి ఉంది.

Next Story