బ్రిటన్‌ ఎన్నికలు: 96 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ సీజన్‌లో..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Oct 2019 1:33 PM GMT
బ్రిటన్‌ ఎన్నికలు: 96 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ సీజన్‌లో..!

బ్రిటన్‌లో మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 12న ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 13న ఫలితాలను ప్రకటిస్తారు. గ‌త నాలుగేళ్లలో బ్రిట‌న్‌లో పార్లమెంట్‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం ఇది మూడ‌వ‌సారి. 2015 మే, 2017 జూన్‌లో కూడా సాధార‌ణ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇక క్రిస్మస్ సీజ‌న్‌లో పార్లమెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం 1923 త‌ర్వాత ఇదే మొద‌టిసారి. దాదాపు 96 ఏళ్ల తర్వాత క్రిస్మస్ సీజన్‌లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఐతే, ఫెస్టివల్ సీజన్‌లో పోలింగ్ నిర్వహించడాన్ని కొంద‌రు వ్యతిరేకిస్తున్నారు. ఓట‌ర్లు చికాకులోన‌య్యే అవ‌కాశాలు ఉన్నాయని కొన్ని పార్టీలు అభిప్రాయపడుతున్నాయి.

బ్రిటన్‌లో మళ్లీ ఎన్నికలు రావడానికి బ్రెగ్జిట్ కారణం. యూరోపియ‌న్ యూనియ‌న్ నుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియ ఇంకా ముగిసిపోలేదు. బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తికి డిసెంబర్ వరకు గడువు పొడిగించారు. ఐతే, బ్రెగ్జిట్ ప్రతిష్టంభ‌న‌ను తొల‌గించే దిశగా ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని బోరిస్ జాన్సన్ భావించారు. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణ కోరుతూ హౌజ్ ఆఫ్ కామన్స్‌లో తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తీర్మానానికి సభ ఆమోదించింది. తీర్మానానికి అనుకూలంగా 438 మంది స‌భ్యులు ఓటేశారు. 20 మంది వ్యతిరేకంగా ఓటేశారు. దాంతో ఎన్నికలకు రూట్ క్లియరైంది. ఇప్పుడు బ్రిటన్ ప్రజలే తీర్పు ఇవ్వనున్నారు.

ఓటింగ్‌లో మద్దతు సాధించడానికి బోరిస్ జాన్సన్ పక్కా ప్లాన్‌గా వ్యవహరించారు. వారం క్రితం క‌న్సర్వేటివ్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన‌ ప‌ది మంది స‌భ్యుల‌ను మ‌ళ్లీ పార్టీలోకి తీసుకున్నారు. ఐతే, ఓటింగ్‌లో లేబ‌ర్ పార్టీ ఎంపీలు స‌గం మంది పాల్గొన‌లేదు. ఐతే హౌజ్ ఆఫ్ కామ న్స్‌లో పాసైన బిల్లు.. హౌజ్ ఆఫ్ లార్డ్స్‌లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. రెండు సభల్లో ఆమోదం పొందిన తర్వాత చ‌ట్టంగా మారుస్తారు. వ‌చ్చే బుధ‌వారం బ్రిట‌న్ పార్లమెంట్‌ను ర‌ద్దు చేయ‌నున్నారు.

Next Story