నేడే బ్రిటన్ ఎన్నికలు..!

By జ్యోత్స్న  Published on  12 Dec 2019 4:27 AM GMT
నేడే బ్రిటన్ ఎన్నికలు..!

సార్వత్రిక ఎన్నికలకు బ్రిటన్ లో సర్వం సిద్ధమయింది. ఇవి నాలుగేళ్ల వ్యవధిలో మూడోసారి జరుగుతున్న ఎన్నికలు. 2015లో సార్వత్రిక, 2017లో ముందస్తు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు మరో ముందస్తుకు రంగం సిద్ధమైంది. రాజ్యాంగం ప్రకారం దిగువసభలో మూడింట రెండొంతుల మంది సభ్యుల ఆమోదం ఉంటేనే ముందస్తు ఎన్నికలకు మార్గం సుగమమవుతుంది. అంటే మొత్తం 650 స్థానాలు గల దిగువసభ లో కనీస మెజారిటీ సాధించాలంటే 326 స్థానాలు గెలవాలి. ఇంగ్లాండ్‌లో 533, స్కాట్లాండ్‌లో 59, వేల్స్‌లో 40, ఉత్తర ఐర్లాండ్‌లో 18 స్థానాలు ఉన్నాయి. దేశ రాజకీయాల్లో ఇంగ్లాండ్‌ ప్రాధాన్యం ఎక్కువ ఎందుకంటే అత్యధిక స్థానాలు ఉండటమే ఇందుకు కారణం.

ఇక ప్రస్తుత ఎన్నికలలో మొత్తం 650 స్థానాలకు గాను 3,322 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దాదాపు 4.6 కోట్ల మంది ఓటర్లు గురువారం నాటి పోలింగ్‌లో.తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అక్టోబర్‌లో ఎన్నికలు ప్రకటించిన నాటినుండి ఇప్పటి వరకూ దాదాపు 31 లక్షల మంది ఓటర్లు తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. ఇందులో 20 లక్షల మంది 35 ఏళ్లలోపు వారు కాగా మరో 10 లక్షల మంది 25 ఏళ్ల లోపు యువ ఓటర్లు. ఎన్నికల ఫలితాలపై వీరి ప్రభావం గణనీయంగానే వుంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ నేతృత్వంలోని అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి, ప్రతిపక్ష నేత జెరిమీ కార్బిన్‌ నేతృత్వంలోని లేబర్‌ పార్టీకి ప్రధాన పోటీ వుంది.

Next Story