హెలికాఫ్టర్లో మండపానికి వెళ్లిన పెళ్లి కూతురు

By రాణి  Published on  19 Feb 2020 5:48 AM GMT
హెలికాఫ్టర్లో మండపానికి వెళ్లిన పెళ్లి కూతురు

పెళ్ళికి బారాత్ చేయడం కామన్. హిందూ సాంప్ర‌దాయమే కాకుండా ఇత‌ర ప‌లు సాంప్ర‌దాయాల్లో కూడా ఎవ‌రైనా పెళ్లి చేసుకుంటే బారాత్ చేయ‌డం, వీధుల్లో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురును ఊరేగించ‌డం మామూలే. ఈ సంద‌ర్భంగా ఇరు వ‌ర్గాల‌కు చెందిన వారు డ్యాన్స్‌లు వేస్తూ, ప‌టాసులు కాలుస్తూ సంబ‌రాలు జ‌రుపుకుంటారు. ఇప్పుడంటే కార్లలో వెళుతున్నారు గానీ ఒకప్పుడు ఏనుగులు, గుర్రాలపై పెళ్ళికొడుకును ఊరేగించేవారు . అయితే ఓ తండ్రి పెళ్లి ఉరేగింపు ఏకంగా హెలికాప్టర్ లో చేసాడు. తన గారాల పట్టి కోరికమేరకు పెళ్లికి ఏకంగా రూ. 9 లక్షలు ఖర్చుపెట్టి హెలికాప్టర్‌ను తీసుకువచ్చారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా అర్తాపూర్‌ తహసీల్‌ పరిధి కోండా గ్రామ సర్పంచి రామారావు కదం కుమార్తె శిల్పకు హింగోళి జిల్లా ఔండా తహసీల్‌ పరిధిలోని ఉక్లి గ్రామానికి చెందిన మోహన్‌ గాయక్‌వాడ్‌తో పెళ్లి కుదిరింది. వివాహ సమయంలో తనను హెలికాప్టర్‌లో పెళ్లి మండపానికి తీసుకురావాలని, వివాహం తర్వాత అత్తవారింటికి కూడా హెలికాప్టర్‌లోనే సాగనంపాలని వధువు తన తండ్రిని కోరింది.

తన ముద్దుల కూతురి ముచ్చట తీర్చడం కోసం తండ్రి రామారావు పది రోజుల కిందట పుణె వెళ్లి హెలికాప్టర్‌ను బుక్‌ చేసుకున్నారు. ఇందుకోసం రూ. 9 లక్షలు కిరాయి చెల్లించారు. సోమవారం మధ్యాహ్నం కోండా గ్రామం నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని అర్తాపూర్‌ తహసీల్‌ కేంద్రంలో పెళ్లి జరిగింది. వధువును ఇంటి నుంచి కల్యాణ మండపానికి హెలికాప్టర్లో తీసుకువెళ్లారు. పెళ్లయ్యాక వధూవరులను 25 కిలోమీటర్ల దూరంలోని వరుడి ఇంటికి కూడా హెలికాప్టర్‌లోనే పంపించారు. ఈ అపురూప క్షణాలను వధూవరులు మాత్రమే కాదు, పెళ్లికి వచ్చిన వారితోపాటు ఊరందరూ ఆసక్తిగా తిలకించారు. కాంగ్రెస్ నాయకురాలు, మంత్రి అశోక్ చవాన్, ఆయన భార్య అమితా చవాన్ కూడా ఈ జంటను ఆశీర్వదించడానికి వచ్చారు.

Bride Came To Wedding Hall In Helicopter 2

Next Story