ఏపీలో ఎన్నికలకు ముందు నుంచి టీడీపీకి భారీ షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటి వరకు ప్రముఖులు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ నుంచి వలసలు కొనసాగాయి. తాజాగా ఇప్పుడు టీడీపీ మరో ఎదురు దెబ్బతగిలింది. పార్టీ విద్యార్థి విభాగం, తెలుగు నాడు విద్యార్థి ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి తన పదవికి రాజీనామా చేశారు. కొంత కాలంగా ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు.గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా సమస్యలపై పోరాడారు. కాగా, వ్యక్తిగత కారణాల వల్లే తన పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. సాధారణ కార్యకర్తగా పార్టీలో కొనసాగుతానని చెప్పుకొచ్చారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన బ్రహ్మం చౌదరి తనను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుండి నడిపించారని అన్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ కు అత్యంత సన్నిహితుడనే పేరు కూడా ఉంది. నిన్న, మొన్నటి వరకు పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని ఒక్కసారిగా రాజీనామా చేయడంతో టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.