ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌కు బాంబ్ బెదిరింపు కలకలం
By అంజి Published on 6 Feb 2020 3:08 AM GMTహైదరాబాద్: సికింద్రాబాద్-విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు వచ్చిన బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. సికింద్రాబాద్ నుంచి ఇంటర్‌సిటీ ట్రైన్ బయల్దేరిన కాసేపటికే అధికారులు నిలిపివేశారు. ట్రైన్‌లో బాంబు పెట్టామంటూ ఇవాళ ఉదయం ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి అధికారులకు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు చేపట్టారు. ట్రైన్‌లో బాంబు ఉందేమోనని రైలు ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక బెంబెలెత్తిపోయారు. ట్రైన్‌లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. బాంబు ఎక్కడా కనిపించకపోవడంతో అందరూ ఊపిరీపిల్చుకున్నారు. ప్రస్తుతం అధికారులకు వచ్చిన ఫోన్‌కాల్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆకతాయిల పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజు ఉదయం సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంది.