పాకిస్తాన్‌లో భారీ పేలుడు..
By అంజి Published on 18 Feb 2020 2:45 AM GMT
పాకిస్థాన్‌లోని క్వెట్టా ప్రెస్ క్లబ్ వద్ద భారీ పేలుడు సంభవించింది. సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా.. మరో 20మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు జరిగినట్టుగా సమాచారం అందగానే స్థానిక పోలీసులు, రెస్క్యూ టీం రంగంలోకి దిగాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బలూచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి లియాఖత్ పాహ్వాని ఈ విషయాన్ని ధృవీకరించారు.
క్వెట్టా పట్టణంలో ఉన్న ప్రెస్‌క్లబ్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. క్వెట్టా డిఐజి అబ్ధుల్ రజాక్ మాట్లాడుతూ.. ఈ ఘటనను అత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నామని అన్నారు. ప్రెస్‌క్లబ్ సమీపంలో ఒక ఆందోళన జరుగుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది. పేలుడు ధాటికి సమీపంలోని పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. పేలుడు జరిగిన వెంటనే.. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నాయి. పేలుడుకు గల కారణం ఏంటీ.. ఎవరు చేశారన్న దానిపై దర్యాప్తు చేపడుతున్నారు.
ఈ ఘటనపై 24 గంటల్లోగా నివేదిక సమర్పించాలని బలూచిస్థాన్ ముఖ్యమంత్రి జమ్ కమల్ ఖాన్ ఐజిపిని ఆదేశించారు. ఈ ఘటనను ఖండించిన బలూచిస్తాన్ గవర్నర్ అమానుల్లా ఖాన్ ఇటువంటి దాడులు దేశ, భద్రతా బలగాల విశ్వాసాన్ని బలహీనం చేయలేవని పేర్కొన్నారు. ఉగ్రవాదుల ప్రణాళికలపై నిఘా ఉంచి వారిని నిలువరించాల్సిన అవసరం ఉందని అన్నారు. గత నెల 10న కూడా క్వెట్టాలోని శాటిలైట్ టౌన్ ఏరియాలో ఉన్న మసీదులో ఓ బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో 15 మంది మృతిచెందగా, 19 మందికి గాయాలయ్యాయి.