చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. దర్శక-నిర్మాత మృతి

By సుభాష్  Published on  6 Sep 2020 3:14 AM GMT
చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. దర్శక-నిర్మాత మృతి

బాలీవుడ్ చిత్ర పరిశ్రమను విషాదం ఇంకా వెంటాడుతూనే ఉంది. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత జానీ బక్షీ సెప్టెంబర్ 5న గుండెపోటుతో మరణించారు. 82 సంవత్సరాల జానీ బక్షీ గత కొద్దిరోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. సెప్టెంబర్ 4 నుంచి ఆయన పరిస్థితి విషమించడంతో జుహులోని ఆరోగ్య నిధి ఆసుపత్రిలో చేర్పారు. శనివారం ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు కోవిద్-19 పరీక్ష నిర్వహించగా నెగటివ్ అని వచ్చింది. ఆయన మరణించిన విషయాన్ని కుమార్తె ప్రియ ధృవీకరించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో అంతిమసంస్కారాలను నిర్వహించారు.

బాలీవుడ్ తో ఆయనకు దాదాపు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. మంజిలే ఔర్ బి హై (1974), రావణ్ (1984), ఫిర్ తేరి కహాని యాద్ ఆయే (1993) లాంటి హిట్స్ కు నిర్మాతగా వ్యవహరించారు. డాకు ఔర్ పోలీస్ (1992), ఖుదాయి (1994) సినిమాలకు దర్శకత్వం వహించాడు. బక్షికి బ్రాండో, కెన్నెడీ, బ్రాడ్ మన్ ముగ్గురు కుమారులు ఉన్నారు. ప్రియ కుమార్తె కూడా ఉంది.

బక్షి మరణవార్త విని పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు. అనుపమ్ ఖేర్ జానీ భక్షీ ఎంతో మంచి వ్యక్తి అని.. ఆయన మరణం తనను కలచివేసిందని తెలిపారు. ముంబైలో నటుడిగా తన ప్రయాణం మొదలైన సమాయంలో ఎంతో సహాయం చేశాడని అనుపమ్ ఖేర్ తెలిపారు. ఆయన చుట్టూ ఉన్నవారి మోములో ఎప్పుడూ నవ్వు ఉండేలా బక్షి చేయగలడని అన్నారు. షబానా అజ్మీ, కునాల్ కోహ్లీ తదితరులు బక్షి ఆత్మ శాంతించాలంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.

Next Story