ఆ తాగుబోతు డ్రైవర్ పెద్ద “బుడ్డీ బాబు”
By Newsmeter.Network Published on 28 Nov 2019 7:42 AM GMTపూటుగా తప్ప తాగి ఇష్టారాజ్యంగా కారు తోలుతూ ఓ ఐటీ ప్రొఫెషనల్ ని ఆదివారం పొట్టన బెట్టుకున్న తాగుబోతు డ్రైవర్ అశ్విన్ గత చరిత్ర చాలా “ఘనమైనద”ని పోలీసులు చెబుతున్నారు. 30- ఏళ్ల అశ్విన్ తన బీ ఎం డబ్య్యు తో రాంగ్ సైడ్ లో వస్తూ మాధాపూర్ దగ్గర ఒక యువ సాఫ్ట్ వేర్ ఉద్యోగి నిండు ప్రాణాలను బలిగొన్నాడు. ఆ సమయంలో అశ్విన్ పీకల దాకా తాగి ఉన్నాడు.
ఆదివారం రాత్రి అశ్విన్ తన కారుతో మోటర్ సైకిల్ పై వస్తున్న అభిషేక్, లీసా ధర్ చౌదరిలను ఢీకొన్నాడు. అభిషేక్ అక్కడికక్కడే మరణించాడు. లీసా తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైంది. రాత్రి 11.30 ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. అశ్విన్ ను స్థానికులు చితకబాదారు. ఆ తరువాత అతడిని పోలీసులకు అప్పగించారు. అతడి ఐడెంటిఫికేషన్ పరేడ్ నిర్వహించి, అతని పేరు, తదితర వివరాలు సేకరించిన తరువాత పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తరువాత అతనిని బెయిల్ ఇచ్చారు. అంతకు ముందు అశ్విన్ నోవాటెల్ హోటల్ లో 10.20 కి దాదాపు నాలుగు పింట్ల బీరును త్రాగినట్టు హోటల్ రికార్డులు, సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిర్ధారించారు.
అశ్విన్ పాత రికార్డులను తిరగేసిన పోలీసులు నిర్ఘాంతపోయారు. ఈ ఏడాదిలోనే రెండు సార్లు డ్రంకెన్ డ్రైవింగ్ కేసుల్లో అతను పట్టుబడ్డాడు. ఈ రెండూ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే జరిగాయి. తాజా యాక్సిడెంట్ జరిగిన రోజు కూడా అతని రక్తంలో వంద మి.లీలో 185 మి.గ్రాముల ఆల్కహాల్ ఉందని పరిశోధనల్లో తేలింది. మామూలుగా 35 మి.గ్రా కన్నా ఎక్కువగా ఉండడానికి అనుమతి లేదు. గతంలో పట్టుబడ్డ రెండు సార్లూ అతని రక్తంలో 100 మి.గ్రా కన్నా ఎక్కువ ఆల్కహాల్ ఉందని పరీక్షలు వెల్లడించాయి. కానీ అశ్విన్ రక్తంలో ఆల్కహాలు భారీ మోతాదులో ఉంది. అశ్విన్ మాధాపూర్ అయ్యప్ప కాలనీలో లో శ్రీ సాయి ఇంటీరియర్స్ అనే కంపెనీని నడుపుతాడని పోలీసులు చెబుతున్నారు.