బెంగళూరు : కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో కమలం వికసించింది. ఉప ఎన్నికల ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడంతో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది. మొత్తం 15 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగగా 12 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయ దుంధుభి మోగించారు. కాంగ్రెస్ 2 స్థానాలతో సరిపెట్టుకోగా మరొక స్థానం స్వతంత్ర అభ్యర్థి కైవసమయింది. జేడీఎస్ కనీసం ఖాతా కూడా తెరలేకపోవడం గమనార్హం. ఉపఎన్నికల్లో కూడా కన్నడిగులు బీజేపీకే పట్టం కట్టారు. దీంతో యడియూరప్ప సర్కారుకు మ్యాజిక్ ఫిగర్ 111 కంటే 6 స్థానాలు అదనంగా వచ్చాయి. ప్రస్తుతం బీజేపీ సంఖ్యాబలం 117. ఇలా ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ జయభేరి మ్రోగించి మళ్లీ యడియూరప్ప సర్కారు అధికారాన్ని చేజిక్కించుకుంది.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు 15 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా..జేడీఎస్ 12 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. సోమవారం వెల్లడైన ఫలితాల్లో గోకాక్, కాగవాడ, అథణి, యల్లాపుర, రాణేబెన్నూరు, హీరెకెరూరు, కెఆర్ పురం, మహాలక్ష్మి లే ఔట్, యశవంతపుర, విజయనగర, కెఆర్ పేట, చిక్కబళ్లాపుర నియోజకవర్గాల్లో కమలనాథులు విజయం సాధించారు. హణసూరు, శివాజినగరలో కాంగ్రెస్ జెండా ఎగరగా హొసకోటె నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బీజేపీ రెబల్ అభ్యర్థి శరత్ కుమార్ గౌడ గెలిచారు. శరత్ కుమార్ బీజేపీ రెబల్ అభ్యర్థి కాబట్టి ఆయన తిరిగి పార్టీలో చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.