దర్శకుడు రాజమౌళికి ఎంపీ వార్నింగ్..!

By సుభాష్  Published on  27 Oct 2020 7:12 AM GMT
దర్శకుడు రాజమౌళికి ఎంపీ వార్నింగ్..!

తెలంగాణ వీరుడు కొమురం భీమ్‌‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కథాంశాలతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్(రౌద్రం ర‌ణం రుధిరం). స్టార్ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌లు క‌లిసి న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్‌, కొమురం భీంగా ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నారు. చెర్రీకి జోడిగా ఆలియా భ‌ట్, ఎన్టీఆర్‌కు జంట‌గా హాలీవుడ్ న‌టి ఒలీవియా మోరీస్ సంద‌డి చేయ‌నున్నారు.

ఇదిలా ఉంటే.. మొన్న కొమరం భీం జయంతి సందర్భంగా.. ఎన్టీఆర్ లుక్‌ని రివీల్ చేస్తూ టీజర్‌ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. కాగా.. గతంలో రామ్ చరణ్ లుక్ టీజర్‌కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించగా.. ఎన్టీఆర్‌ టీజర్‌కు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అందించాడు. ఇప్పుడు ఈ టీజరే వివాదస్పదమయ్యింది. టీజ‌ర్‌లో భీమ్ టకియాను ధరించడం వివాదాస్పదంగా మారింది. వెంటనే ఆ సీన్ తొలగించాలని పలు ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మనోభావాలను దెబ్బ తీయొద్దని హెచ్చరిస్తున్నాయి.

దర్శకుడు రాజమౌళికి బీజేపీ ఎంపీ సోయం బాపు రావు వార్నింగ్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ మూవీలో భీమ్ పాత్ర ధరించిన టకియాను(ముస్లింలు ధరించే టోపి) తొలగించాలని సూచించారు. అలా కాదని సినిమా విడుదల చేస్తే థియేటర్లను తగుల బెట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. కలెక్షన్ల కోసం తమ ఆరాధ్య దైవాన్ని కించపరిస్తే సహించబోమన్నారు. నైజాంకు వ్యతిరేకంగా కొమురం భీం పోరాటం చేసి అమరుడయ్యారని, భీమ్‌ను చంపిన వాళ్ళ టోపీ ఆయనకు పెట్టడం ఆదివాసులను అవమానించడమేనన్నారు. రాజమౌళి ఇప్పటికైనా చరిత్రను తెలుసుకోవాలని, లేకుంటే మర్యాద ఉండదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై రాజ‌మౌళి ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.

Next Story