10 మందిని సెక్యూరిటీగా ఉంచినప్పటికీ ఆ బీజేపీ నేతను కాల్చి చంపారు..!

By సుభాష్  Published on  10 July 2020 4:11 AM GMT
10 మందిని సెక్యూరిటీగా ఉంచినప్పటికీ ఆ బీజేపీ నేతను కాల్చి చంపారు..!

శ్రీనగర్: స్థానిక బీజేపీ నేతను, అతడి సోదరుడు తండ్రినిని గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం సాయంత్రం హత్య చేశారు. జమ్మూ కాశ్మీర్ లోని బందిపోరాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బందిపోరా టౌన్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న తన షాపులో షేక్ వసీమ్ బారి ఉండగా అతన్ని మిలిటెంట్లు కాల్చి చంపారు. బందిపోరా జిల్లా మాజీ బీజీపీ ప్రెసిడెంట్ గా విధులు నిర్వర్తించాడు వసీమ్ బారి. అక్కడే ఉన్న వసీమ్ బారి తండ్రి షేక్ బషీర్ అహ్మద్, సోదరుడు ఉమర్ బారిని కూడా మిలిటెంట్లు కాల్చి చంపారు.

హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వానీ చనిపోయి నాలుగు సంవత్సరాలు అయినందు వలన కాశ్మీర్ వ్యాలీని ఒక రోజు పాటూ మూసివేశారు. ఇలాంటి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది కథనం ప్రకారం.. కాల్పుల ఘటన అనంతరం వీరు ముగ్గురిని ఆసుపత్రికి తీసుకుని రాగా.. అప్పటికే చనిపోయారంటూ వైద్యులు ధృవీకరించారు.

మరో కథనం ప్రకారం.. బందిపోరా టౌన్ లోని పోలీసు స్టేషన్ ముందే వసీమ్ ఇల్లు ఉంది. అతడు తన తండ్రి, సోదరుడుతో కలిసి ఉండగా కొందరు ఆతంకవాదులు వచ్చి కాల్పులు జరిపారు. వీరి మీద దాడి జరిగే అవకాశం ఉందని తెలిసి ప్రభుత్వం 10 మందిని వీరికి సెక్యూరిటీగా నియమించింది. కానీ ఈ దాడి జరిగిన సమయంలో ఒక్కరు కూడా అక్కడ లేక పోవడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో వారందరినీ సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ కూడా చేశారు. ఐజీ విజయ్ కుమార్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ మొత్తం పది మంది పిఎస్ఓ లను అరెస్ట్ చేశామని అన్నారు. షేక్ వసీమ్ బారి ఇల్లు మొదటి ఫ్లోర్ లో ఉండగా.. షాపు కింద ఉంది. ఆ సమయంలో అతడి సెక్యూరిటీ సిబ్బంది మొదటి ఫ్లోర్ లో ఉన్నారు. బైక్ మీద వచ్చిన ఆతంకవాదులు సైలెన్సర్ ఉన్న తుపాకీతో వసీమ్ కుటుంబంపై దాడి చేశారు. వీరిని పట్టుకోడానికి పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. వీరి మృతికి తామే బాధ్యులమంటూ ఏ తీవ్రవాద సంస్థ కూడా ప్రకటించలేదు.

Next Story
Share it