రానున్న రోజుల్లో పక్షుల కిలకిలరావాలు వినిపించవా?
By Newsmeter.Network Published on 18 Feb 2020 1:35 PM GMTగత అయిదేళ్లలో మన దేశంలోని పక్షి జాతుల్లో 80 శాతం పక్షుల జనాభా గణనీయంగా తగ్గిపోయింది. స్టేట్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ 2020 పేరిట పది స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేలో పక్షుల జనాభా ప్రమాదకరంగా తగ్గుతోందని వెల్లడైంది. ఈ సర్వేలో పక్షులు నివసించే ప్రదేశాలు, వాటి నివాస యోగ్య ప్రాంతాలు, అవి గూళ్లు కట్టుకునే చోటు, వాతావరణ మార్పుల వంటి పలు అంశాల వివరాలను సేకరించారు. మొత్తం 846 పక్షుల గురించి అంచనాలు వేశారు. 146 పక్షుల జనాభా ఏడాదికేడాది తగ్గుతోందని, మొత్తం మీద ఈ 846 పక్షుల జాతుల్లో దాదాపు 80 శాతం పక్షుల జనాభాలో తగ్గుదల కనిపించింది.
దేశవ్యాప్తంగా 15500 మంది బర్డ్ వాచర్స్ పదిలక్షల చోట్ల పక్షులను అధ్యయనం చేశారు. దాని ఆధారంగా సర్వే నివేదిక తయారైంది. పన్నెండు పక్షిజాతుల జనాభా పెరుగుతుండగా, 135 పక్షుల సంతతి తగ్గుతోంది. 319 రకాల ఇతర పక్షుల జనాభా లోనూ కొద్దిపాటి తగ్గుదల ఉంది. ఈ నివేదిక పక్షి సంతతి తగ్గడానికి కల కారణాలను , తరుణోపాయాలను గురించి కూడా చర్చించింది. పశ్చిమ ఘాట్లలో ఉండే పలు పక్షులు, ఓపెన్ కంట్రీ రాప్టర్లు, షోర్ బర్డులు, గల్స్, టెర్న్స్ వంటి పక్షుల సంతతి దాదాపు సగానికి పడిపోయింది. ఒక 126 జాతుల జనాభా మాత్రం యథాతథంగా ఉంది. ఇందులో పిచ్చుకలు, కోయిల, పీ ఫౌల్, పారాకీట్, టెయిలర్ బర్డ్ వంటివి ఉన్నాయి.
పక్షులు నివసించే చెట్లను కొట్టేయడం, అడవులు తగ్గడం, మానవ ఆవాసాల నిర్మాణం వంటి కారణాల వల్ల పక్షుల జనాభా తగ్గుతోందని ఈ సర్వే చెబుతోంది. పక్షులు అడవుల లోపలికి వెళ్లిపోవడం, మానవ జోక్యం వల్ల గూళ్లు చెదిరిపోవడం వంటి కారణాలు కూడా తోడవుతున్నాయి. యాభై పక్షి జాతులను వన్య జీవి సంరక్షణ కార్యకర్తలు అత్యంత వేగంగా అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేర్చారు. వీటిని ఎర్ర జాబితా అంటారు . పిచ్చుకల జనాభా ఒకప్పుడు చాలా తగ్గిపోయింది. కానీ ఇప్పుడు వాటి జనాభా స్థిరంగా ఉంది. అయితే ముంబాయి, కోల్ కతా, బెంగుళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో మాత్రం అవి దాదాపుగా కనుమరుగైపోయాయి. ఇక రాబందులు దాదాపుగా కనిపించడమే మానేశాయి. గద్దల జనాభా కూడా గణనీయంగా తగ్గింది. రెడ్ లిస్ట్ లో మరిన్ని పక్షులను చేర్చడం ద్వారా వాటిని కాపాడుకోవచ్చునని కూడా నిపుణులు అంటున్నారు.
ఇలాంటి జాబితా వెలువడటం ఇదే మొదటి సారి. ఈ జాబితా ఆధారంగా పక్షి ప్రేమికుల క్రియాశీలత పెరుగుతుందని, పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలు వేగవంతమౌతాయని, తద్వారా పక్షి సంతతిని కాపాడవచ్చునని భావిస్తున్నారు.